తెలంగాణ సిఎం కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ఒదీషా సిఎం, బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు. మొన్నటికి మొన్న బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఝార్ఛండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ల మాదిరిగానే ఒదీషా సిఎం నవీన్ కూడా అదే తరహాలో షాక్ ఇచ్చారు. అయితే వారిలా కాకుండా నవీన్ పట్నాయక్ కొత్త రకం షాక్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కగలజేసే అంశం. మరి నవీన్ పట్నాయక్ ఇచ్చిన కొత్త స్టయిల్ షాక్ ఏంటో చదవండి మరి.

మంగళవారం తెలంగాణ సిఎం ఆఫీసు నుంచి ఒక సమాచారం మీడియాకు వెలువడింది. ఆ సమాచారం సారాంశం ఏమంటే కేసిఆర్ నెలకొల్పబోయే ఫెడరల్ ఫ్రంట్ తో చేతులు కలుపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తమతో చర్చించేందుకు రావాలంటూ కేసిఆర్ ను నవీన పట్నాయక్ ఆహ్వానించారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఒదీషాలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆ సమావేశాల అనంతరం అంటే మే మొదటి వారంలో రావాల్సిందిగా ఆహ్వానించారని తెలంగాణ సిఎం కార్యాలయం తెలిపింది. కేసిఆర్ నెలకొల్పబోయే ఫెడరల్ ఫ్రంట్ లో ఇదొక ముందడుగు అని కూడా వెల్లడించింది. నవీన్ పట్నాయక్ అభ్యర్థనను తెలంగాణ సిఎం కేసిఆర్ అంగీకరించినట్లు కూడా సమాచారంలో పేర్కొన్నారు. దీంతో మే మొదటి వారంలో తెలంగాణ సిఎం కేసిఆర్ ఒదీషా వెళ్లి నవీన్ పట్నాయక్ ను కలుస్తారని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నంలో ఇదో ముందడుగు అన్నట్లు ప్రకటనలో వెల్లడించారు. దీంతో తెల్లారితే తెలుగు పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించాయి. కేసిఆర్ తో నవీన్ పట్నాయక్ చేతులు కలిపేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి.

అయితే తెలుగు పత్రికల్లో వార్తలొచ్చిన నేఫథ్యంలో ఈ విషయమే నవీన్ పట్నాయక్ భువనేశ్వర్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంగ్లీషులో ఏమన్నారో కింద చదవండి.

"The Telangana Chief Minister is visiting Puri on a pilgrimage. On the way, he will pay a courtesy call (on me). There will be no discussion on the federal front or anything that has to do with politics," Naveen Patnaik told media in Bhubaneswar.

తెలుగులో చదవండి.

"తెలంగాణ ముఖ్యమంత్రి ఒదీషాలోని పూరీ తీర్థయాత్రకు వస్తున్నారు. దారిలో మర్యాదపూర్వకంగా (నన్ను)కలుసుకునేందుకు వస్తానన్నారు. అపుడు ఫెడరల్ ఫ్రంట్ మీద  గాని  లేదా రాజకీయాంశాల మీద గాని ఎలాంటి చర్చ ఉండదు.’’- నవీన్ పట్నాయక్

నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడిన వీడియో  ఒదీషా లోని ఒక చానల్ ఇచ్చిన లింక్ పైన ఉంది చూడండి.

మొత్తానికి తెలంగాణ సిఎం ఆఫీసు ఇచ్చిన సమాచారం ఒకలా ఉంటే.. ఏకంగా ఒదీషా సిఎం నవీన్ పట్నాయక్ మాట్లాడిన మాటలు మరో రకంగా ఉండడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చను లేవనెత్తింది. ఇలా గతంలోనూ జరిగిన విషయాన్ని తెలంగాణవాదులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్వయంగా కేసిఆర్ కు ఫోన్ చేసి మద్దతు పలికినట్లు తెలంగాణ సిఎం కార్యాలయం ప్రకటించింది. కానీ ఆమె కాల్ చేయలేదని, కేసిఆరే ఆమెకు కాల్ చేశారని టెలిగ్రాఫ్ పత్రిక రాసింది. అంతేకాదు కాంగ్రేసేతర ఫ్రంట్ తనకు సమ్మతం కాదని మమత తేల్చి చెప్పారు. కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ కావాలన్నారు.

ఇక ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరేన్ ఫోన్ చేసి మద్దతు పలికారని తెలంగాణ సిఎం ఆఫీసు ప్రచారం చేసింది. కానీ తర్వాత రోజే హేమంత్ సోరేన్ రాహుల్ గాంధీతో చేతులు కలిపి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా నవీన్ పట్నాయక్ కూడా అదే ధోరణిలో మాట్లాడారు. మొత్తానికి ఈ రకమైన ప్రచారం తెలంగాణ సిఎం ఆఫీసు నుంచి ఎందుకు చేస్తున్నారా అని తెలంగాణావాదులు ఆరా తీస్తున్నారు.