నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డ్ శాశ్వతంగా రద్దు చేసింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డ్ శాశ్వతంగా రద్దు చేసింది. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు దర్యాప్తులో .. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరణించిన వివరాలు తెలియాల్సి వుంది. 

సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అందించింది. శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ పై వేధింపులు నిజమేనని ఈ కమిటీ తేల్చి చెప్పింది. కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్ధులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా కమిటీ ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇచ్చింది. సాత్విక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. తన మరణానికి కారణమంటూ సాత్విక్ సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరు నలుగురిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. వారి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. వారిని వదలొద్దని సాత్విక్ సూసైడ్ నోట్‌లో కోరాడు.

Also Read: సాత్విక్ ఆడ్మిషన్ మరో కాలేజీలో ఉన్న విషయం తెలియదు: పేరేంట్స్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజప్రసాద్, అలివేలు దంపతు చిన్న కుమారుడు సాత్విక్.. నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం కాలేజ్ హాస్టల్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి.. కాలేజ్ లెక్చరర్లు వేధింపులే కారణమని సాత్విక్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. మార్కులు తక్కువగా వస్తున్నాయని లెక్చరర్లు వేధించినట్టుగా సాత్విక్ తమతో చెప్పుకుని బాధపడినట్టుగా అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సాత్విక్ కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.