హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం దక్కని వాళ్లంతా తుపాకులు పట్టేందుకు సిద్ధపడితే తాను కూడా తుపాకీ పట్టాల్సిన వాడినేనని ఆయన అన్నారు. 

తన సోదరుడు అసోంలో డివిజనల్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి, దోషులందర్నీ న్యాయస్థానం ముందు నిలబెట్టిందన్నారు. నిందితులంతా నిర్దోషులుగా విడుదలై పోయారని గుర్తు చేశారు. 

ఆ సమయంలో తనకు ధైర్యం లేకపోవడం వల్లనే ఇలా మీ ముందు గవర్నర్‌గా ఉన్నానని, లేకుంటే ఆయుధం కలిగిన్న టెర్రరిస్టుగా ప్రభుత్వం తనపై లుకౌట్‌ నోటీసు జారీచేసి ఉండేదని వ్యాఖ్యానించారు. 

న్యాయం దక్కని సందర్భాల్లోనే చాలామంది తుపాకులు పడుతున్నారని అన్నారు. నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. హైకోర్టు సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఎస్ఎం ఖాద్రి, జస్టిస్‌ పి.వెంకట్‌రెడ్డిల సమక్షంలోనే గవర్నర్‌ న్యాయవ్యవస్థలోని లోపాలను ఆయన ఎత్తిచూపారు. 

రాజ కుమారుడికైనా, సాధారణ పౌరుడికైనా ఒకే రకమైన న్యాయం  అందాలని, ప్రపంచమంతా ఏకమై ఒక నేరస్థుడిని కాపాడాలని భావించినా న్యాయవ్యవస్థ ప్రభావితం కారాదని అన్నారు. మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్నదేమిటని అడుగుతూ ధనికులకు, పేదలకు న్యాయం సమానంగా అందుతోందా అని కూడా ప్రశ్నించారు. 

కోర్టులో నేరస్థుడు, హంతకుడు అని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. సంపన్నుడు నేరారోపణ జరగ్గానే గుండె పోటు అని చెబుతూ వెంటనే ఆసుపత్రిలో చేరిపోతాడని, అదే ఆరోపణ  పేదవాడిపై వస్తే వెంటనే జైలు పాలవుతాడని, అంతిమ తీర్పు అతడికి వ్యతిరేకంగా కూడా రావచ్చునని అన్నారు.