నాంపల్లి అగ్ని ప్రమాదం: బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Hyderabad Building Fire: హైదరాబాద్ లోని నాంపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామనీ, ప్రమాదం సంభవించిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో రసాయనాలు ఉండటంతో తీవ్రత ఎక్కువైందని పోలీసులు తెలిపారు.
Nampally fire Accident: నాంపల్లిలోని బజార్ ఘాట్ వద్ద సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించి రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది నుండి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మీడియా ప్రతినిధులతో కేటీఆర్ మాట్లాడుతూ.. ఘటనపై విచారణ అనంతరం ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
హైదరాబాద్‌లోని నాంపల్లిలోని బజార్‌ఘాట్ సమీపంలోని గోడౌన్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామనీ, మృతులకు సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలనీ, వారు త్వరగా కోలుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నాంపల్లి అగ్నిప్రమాదంలో 9 మంది మృతి
నాంపల్లిలోని బజార్‌ఘాట్ లోని నివాస భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భవనంలోని సెల్లార్‌లో మెకానిక్ కారు మరమ్మతులు చేస్తుండగా నిప్పురవ్వ చెలరేగడంతో మంటలు చెలరేగడంతో కొంత కంటైనర్‌లో నిల్వ ఉంచిన డీజిల్‌కు మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. సెల్లార్‌లో నిల్వ చేసిన కొన్ని రసాయన డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ, తరువాత భారీ మంటలు చెలరేగాయి.
తొమ్మిది మంది ఊపిరాడక చనిపోయారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ సెంట్రల్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతులను ఎండి. ఆజం (58), రెహానా సుల్తానా (50), ఫైజా సమీన్ (26), తాహూరా ఫరీన్ (35), తూబా (6), తరూబా (13), ఎండి. జకీర్ హుస్సేన్ (66), నికత్ సుల్తానా (55), హసిబ్‌ఉర్-రహ్మాన్ (32)లుగా గుర్తించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది నిచ్చెనల సహాయంతో పై అంతస్తులో ఉన్న వారిని రక్షించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు.