కాంగ్రెస్ పార్టీలో  చేరానన్న విషయాన్ని మరిచిపోయారో ఏమోగానీ నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతే రాష్ట్ర అభివృద్దికి అడ్డంకిగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అంతలోనే తప్పు తెలుసుకున్న నాగం...కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ పార్టీ అవినీతి అభివృద్దికి అడ్డంకిగా మారిందంటూ సరిచేసుకున్నారు. 

తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ పై నాగం విరుచుకుపడ్డారు. హరీష్ పెద్ద పనికిమాలిన వ్యక్తి అని, ఆయన అవినీతి బాగోతాన్ని త్వరలో బైటపెడతానంటూ తీవ్ర  విమర్శలు చేశారు. హరీష్ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకుంటోందనడాన్ని నాగం తప్పుబట్టారు. కట్టెలు తాము హరీష్ కాళ్లలో పెడుతున్నామా? లేక ఆయన మామ కేసీఆర్ కాళ్లలో పెడుతున్నామా? అంటూ ప్రశ్నంచారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతా మేమే చేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని నాగం మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు మోటార్లను కాంగ్రెస్ పార్టీ యాంలోనే తీసుకువచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ ప్రాజెక్టు గురించి సమచార హక్కు చట్టం ప్రకారం సమాచారం అడిగితే ఇవ్వడం లేదని
నాగం అన్నారు.  

తనకు సెక్యూరిటీని తగ్గిస్తే బైట తిరక్కుండా ఉంటానని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించినట్లుందని, ప్రజలే తనకు సెక్యూరిటీగా ఉండి కాపాడతారని నాగం అన్నారు. టీఆర్ఎస్ అగ్రనాయకుల దోచుకోవడం, దాచుకోవడం గురించి మాట్లాడుతున్నందుకే తనపై కక్ష్యగట్టారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీఎస్టిమేషన్లు అందుకే జరుగుతున్నాయన్నారు. 

తప్పుగా మాట్లాడినా, తప్పు చేసినా తనను జైళ్లో పెట్టాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నాగం ప్రశంసించారు.. అవి ప్రజలకు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు.