పెళ్లిలో ఏదో ఓ కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు నెటి యువత.. ముఖ్యంగా తమదైన మార్కుతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ప్రీ వెడ్డింగ్ షూట్ లనుంచి పెళ్లి పత్రికల వరకు వెరైటీగా ఏదో ఒకటి క్రియేటివ్ గా ట్రై చేస్తున్నారు. అలాగే చేశాడో వ్యక్తి..
కరీంనగర్ : తెలంగాణ స్టైల్లో పెళ్లి పత్రిక కొట్టించాడో యువకుడు.. ఇప్పుడా యువకుడి పెళ్లి పత్రిక వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటంటారా? తెలంగాణ భాషలో ముచ్చటగా మురిపించేలా.. చక్కగా పెళ్లి పత్రిక అచ్చేయించాడు.. ఇంతకీ అతనెవరంటే... మై విలేజ్ షో... గుర్తుంది కదా.. ఆ షోకు డైరెక్టర్, రైటర్ శివకృష్ణ.
గంగవ్వ పేరు చెబితే ఈ షో బాగా గుర్తుకు వస్తుంది. తెలంగాణ పల్లె, బాష, యాసల నేపథ్యంతో సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ షో. ఆ తరువాత ఈ షో చేసే గంగవ్వకు సెలబ్రిటీ స్టేటస్ రావడం.. బిగ్ బాస్ లోనూ కంటెస్టెంట్ గా వెళ్లడం..గుర్తుకువస్తారు. మై విలేజ్ షో అనిల్ కూడా ఇదే కోవలో యూట్యూబర్ గా అందరికీ పరిచయమయ్యాడు. ఆయన కూడా రెండేళ్ల క్రితం ఇలాగే పెళ్లి పత్రిక కొట్టించిన విషయం తెలిసిందే.
ఇక ఈ పత్రిక విషయానికి వస్తే.. ‘రచన, దర్శకత్వం, నటన అంటూ తిరుగుతున్న మావోనికి మూడుముళ్ల బంధంతో ముడేయడమే ఈ కథాంశం’ అంటూ బుర్రవారు సమర్పించే.. పెళ్లి పత్రిక పేరుతో ఈ కార్డ్ అచ్చయ్యింది. సినిమాను పరిచయం చేసినట్టుగా అచ్చేశారు. అదీ తెలంగాణ యాసలో..
వాలెంటైన్స్ డే : ట్విట్టర్ కలిపిన ప్రేమబంధం.. హైద్రాబాదీ జర్నలిస్ట్ క్యూట్ లవ్ స్టోరీ..!
ఇక జీవితమనే ఈ సినిమాలో.. ‘వీరో : మా సిన్న కొడ్కు
వీరోయిన్ : కాబోయే కోడలు...
సైన్మా పేరు : శివయ్య లగ్గం... ఐతారం పూట అయ్యే ఈ లగ్గం నూరేండ్లు సూపర్ హిట్ అయ్యేలా దీవించనీకి తప్పకుండా రాండ్రి’ అని పత్రికలో మరో కొంత భాగం.. కనిపిస్తుంది.
ఇంతటితో అయిపోలేదు.. ఫంక్షన్ హాల్ వివరణ..‘లగ్గమయ్యే టాకీస్..’ అని.. దావత్ కు ‘మారువెళ్లి లేదు.. ఒక్కకాన్నే భోజనాలు’ అని అచ్చ తెలంగాణలో ముద్రించారు.
తెలంగాణలో పెళ్లంటే భరాత్ ఉండాలె.. ధూందాం ముచ్చట.. డ్యాన్సులు ఇవ్వి లేంది నడ్వవు కదా.. అందుకే అది కూడా పత్రికల కొట్టించిండ్రు..
‘భరాత్ : పొద్మీకి 7గం.ల తర్వాత.. లగ్గమైనోళ్లు.. కానోళ్లు..మన సంకెపల్లి ఊల్లె పొట్టు పొట్టు ధూంధాం ఎగురుదాం.. బందవస్తు బూట్లేసుకుని రార్రి’ అంటూ పిలిచారు..
అంతేనా.. ఎక్వతక్వ లొల్లి జేస్తే.. ఎవ్వల్ లొల్లికి ఆల్లే బాధ్యులని గమనిక కూడా పెట్టిండ్రు.. అదన్నమాట తెలంగాణ పెండ్లి పత్రిక పిల్పులు.. బాగుంది కదా వెరైటీగా..
