హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలిచింది మైహోమ్ గ్రూప్. ప్రముఖులు ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన  ఈ సంస్థ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్లు విడుదల చేసింది.

కార్పోరేట్ సిటిజన్‌గా నగర వాసుల్ని ఆదుకోవడం తన బాధ్యతని మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు అన్నారు. ఈ మొత్తంతో బాధితులకు కాస్తయినా ఉపశమనం దొరుకుతుందని రామేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి నగరం త్వరగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు.

ఇక మైహోమ్ గ్రూప్‌తో పాటు మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి సైతం రూ. 10 కోట్ల విరాళం ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు పది కోట్ల చెక్కును ఆయన స్వయంగా అందజేశారు. ఇటు నగర వాసులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ కూడా ముందుకు వచ్చింది.

Also Read:చిరు, మహేష్ కోటి...ఎన్టీఆర్ 50లక్షలు...వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ స్టార్స్

ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండే నంద‌మూరి బాల‌కృష్ణ వ‌ర‌ద బాధితుల‌కు కోటిన్నర రూపాయలను విరాళంగా ప్రకటించాడు.ఇక బాలయ్య ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన హీరోలందరూ ముందుకు వచ్చారు. చిరంజీవి, మహేశ్ బాబు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు.

అక్కినేని నాగార్జున, జూనియ‌ర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, త్రివిక్రమ్ & హారిక హాసిని ప్రొడక్షన్ రూ.20 లక్షలు, యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 ల‌క్ష‌లు, హ‌రీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 ల‌క్ష‌లు విరాళం అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు!