2020 ప్రజలకు కఠిన పరిస్థులను పరిచయం చేసింది. కరోనా వైరస్ కారణంగా జనజీవనం అస్థవ్యస్తం కావడం జరిగింది. ఇది చాలదన్నట్లు హైదరాబాద్ ని ముంచెత్తిన వరదలు మరింత ఇక్కట్లు పాలు చేశాయి. ఎన్నడూ లేని విధంగా నమోదైన వర్షపాతం వలన మూసీ నదితో పాటు అనేక చెరువులు పొంగి నివాస స్థలాలను ముంచెత్తాయి. రోడ్లు వాగులై పారంగా, అనేక మంది ప్రవాహానికి కొట్టుకుపోయారు. వాహనాలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్తు, ఆహారం, నీరు లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఈ నేపథ్యంలో వరదల బారినపడ్డ నిస్సహాయులను ఆదుకొనేందుకు టాలీవుడ్ స్టార్స్ మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయార్ధం స్టార్ హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణా సీఎం సహాయ నిధికి తమ వంతు ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సాయం ప్రకటించగా, మహేష్ మరో కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ప్రకటించారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరద బాధితుల సహాయార్ధం రూ.  50 లక్షల సాయం ప్రకటించారు. కింగ్ నాగార్జున, బాల కృష్ణ సైతం చెరో రూ. 50 లక్షల రుపాయిలు సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ మరో రూ. 10లక్షల సాయం చేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి మరియు హరీష్ శంకర్ తలో రూ. 5లక్షల చొప్పున వరద బాధితుల సహాయార్ధం...తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మిగిలిన సినీ ప్రముఖులు సైతం సాయానికి ముందుకు వస్తున్నారు.