‘తమ్ముడు బరిలో లేడు’.. మోడీని పెద్దన్న అనడంపై రేవంత్ కామెంట్స్
తన తమ్ముడు లోక్ సభ బరిలో లేడని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నుంచి రేవంత్ రెడ్డి సోదరుడు పోటీ చేస్తాడని జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టారు. మోడీని పెద్దన్న అని అనడంపైనా ఆయన వివరణ ఇచ్చారు.
తన తమ్ముడు మహబూబ్ నగర్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో తన తమ్ముడు పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. ఇక మోడీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి సంబోధించడంపై బీఆర్ఎస్ దాడికి దిగింది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హల్ చల్ చేస్తున్నది. ఈ విమర్శలపైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
తనదంతా బహిరంగమే అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తరహా మోడీ చెవిలో గుసగుసలు ఆడలేదని పేర్కొన్నారు. దేశానికి ప్రధానమంత్రి ఆయన.. కాబట్టి, పెద్దన్న లాంటివాడు అనడంలో తప్పేమీ ఉన్నదని వివరించారు.
Also Read: స్తంభించిన ఇన్‌స్టా, ఫేస్‌బుక్ సేవలు.. లాగిన్ సమస్య!
ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌తో చేతులు కలపడాన్ని పేర్కొంటూ.. ఆర్ఎస్పీ తనకేమీ మిత్రుడు కాదని అన్నారు. వారు వారు కలిస్తే తాను మాట్లాడేదేం ఉంటుందని చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తనను కలవడంలో ఎలాంటి తప్పు లేదని వివరించారు. అందులో ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం సరికాదని అన్నారు.