భార్యను చంపి మురుగు కాల్వలో పడేశాడు: 15 ఏళ్లకు చిక్కాడు

Murder case: Accused caught after 15 years
Highlights

భార్యను చంపి మురుగు కాల్వలో పడేసి ఏమీ తెలియనట్లు నటిస్తూ వస్తున్న నిందితుడు 15 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు.

హైదరాబాద్‌: భార్యను చంపి మురుగు కాల్వలో పడేసి ఏమీ తెలియనట్లు నటిస్తూ వస్తున్న నిందితుడు 15 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. భార్యను చంపి మూట కట్టి డ్రైనేజీ కాలువలో పడేశాడు. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

వివాహిత ఎంతకీ దొరకకపోవడంతో 11 ఏళ్ల తర్వాత పోలీసులు కేసు మూసేశారు. దాని సంగతి పోలీసులు మరిచిపోయారు. ఇటీవల అతనిపై మోసం, అక్రమాయుధాల కేసు నమోదైంది. దానిపై విచారణ చేస్తుంటే 15 ఏళ్ల కిందటి హత్య విషయం బయటపడింది.  

ఎల్బీ నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయికి చెందిన చుంటు మల్లికార్జున్‌కు 16 ఏళ్ల కిందట వివాహమైంది. అతని ప్రవర్తన, పద్ధతి నచ్చకపోవడంతో వివాహమైన కొద్ది రోజులకే భార్య విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఏడాదికి అదే మండలానికి చెందిన అనసూయను మల్లికార్జున్‌ వివాహమాడాడు. 

బతుకు దెరువు కోసం హైదరాబాదుకు వచ్చి ఉప్పల్‌ ప్రాంతంలో ఉండేవాడు. కొంతకాలం వరకు భార్యకు పిల్లలు పుట్టలేదు. ఇంట్లో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. గొడవలకు ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దాంతో భార్యను అడ్డు తొలగించుకోవాలని మల్లికార్జున్‌ పథకం వేశాడు. ఓరోజు రాత్రి ముఖంపై దిండుతో అదిమి ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి డ్రైనేజీలో పడేశాడు. ఇది 2003లో జరిగింది.

అప్పుడే తన భార్య కనిపించడం లేదంటూ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అనసూయ తల్లిదండ్రులకు కట్నకానుకలు తిరిగి ఇచ్చేశాడు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు కూడా 11 ఏళ్ల తర్వాత  2014లో కేసు మూసివేశారు. మల్లికార్జున్‌ తన మకాంను ఉప్పల్‌ నుంచి మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్‌కు మార్చి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.
 
అయితే, మల్లికార్జున్‌ కిరాణా దుకాణానికి వచ్చే స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. వారి నుంచి అప్పులు తీసుకుని మళ్లీ ఇచ్చేవాడు కాదు. చిన్ననాటి స్నేహితుడు, తన గ్రామానికే చెందిన మిట్టా ఆంజనేయులు అలియాస్‌ అంజన్నతోనూ 20 ఏళ్ల కిందట కోల్‌కతా నుంచి నగరానికి వచ్చిన ప్రకాశ్‌కుమార్‌ ఝాతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. 

కోల్‌కతా నుంచి ప్రకాశ్‌ ఝా రెండు తుపాకులు తెచ్చాడు. అప్పులు ఇచ్చినవారు అడిగితే తుపాకీ చూపుతూ బెదిరించేవారు. డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితుల నుంచి ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు అందింది. మల్లికార్జున్‌తోపాటు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించారు. 

రూ.16.20 లక్షలు ఏడుగురి నుంచి తీసుకొని మోసం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. విచారణ సమయంలో మల్లికార్జున్‌ ప్రవర్తన పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. అతని కుటుంబ నేపథ్యం, భార్యాపిల్లల గురించి ఆరా తీశారు. తప్పించుకునే అవకాశాలు లేకపోవడంతో భార్యను తానే హత్య చేశానని మల్లికార్జున్‌ అంగీకరించాడు. మల్లికార్జున్‌పై చీటింగ్‌, అక్రమ ఆయుధాల కేసులతోపాటు హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
 
అతను చెప్పిన విధంగా తన భార్యను పడేసిన డ్రైనేజీ కాలువ వద్దకు వెళ్లిన పోలీసులు కొంతమంది కూలీలతో శవాన్ని పడేసిన ప్రాంతంలో ఆనవాళ్ల కోసం గాలించారు. శవానికి సంబంధించిన ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. దీంతో పోలీసులు నిందితుడు మల్లికార్జున్‌పై చీటింగ్‌, అక్రమ ఆయుధాల కేసులతో పాటు హత్యకేసు నమోదు చేశారు.

loader