భువనగిరి ఎంపీ స్థానం: పోటీపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి తమ కుటుంబం నుండి ఎవరినైనా బరిలోకి దింపాలని పార్టీ నాయకత్వం ఆదేశిస్తే పోటీ చేయడంపై ఆలోచిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
శుక్రవారం నాడు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్దిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందుకు తాము కారణమనే ప్రచారాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోసిపుచ్చారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి టిక్కెట్టు కేటాయిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్ని పార్టీల్లో చర్చ ఉందని ఆయన చెప్పారు. ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను కోమటిరెడ్డి లక్ష్మి నిర్వహిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి అత్యధిక మెజారిటీని తీసుకు వచ్చే బాధ్యతను తాను తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు రాష్ట్రంలోని తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో ఇంకా అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.త్వరలోనే ఈ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.