Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అదనపు కలెక్టర్.. మంత్రి హరీష్ రావు అభినందనలు..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించిన ఈ ఐఏఎస్ దంపతులను పలువురు  ప్రశంసిస్తున్నారు.

Mulugu Additional Collector delivers her baby at govt hospital in Bhupalpally
Author
First Published Oct 4, 2022, 11:39 AM IST

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. సోమవారం ఇలా త్రిపాఠికి పురిటి నొప్పులు రావడంతో.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వివరాలు.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య త్రిపాఠి మధ్యాహ్నం ప్రసవ నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరారు. సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో వైద్యుల బృందం సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించింది.

అయితే శిశువు బరువు ఎక్కువగా ఉన్నందున తాము సాధారణ ప్రసవం చేయలేకపోయామని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అందువల్ల తాము సి సెక్షన్ చేయవలసి వచ్చిందని చెప్పారు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య శస్త్ర చికిత్స చేశారని తెలిపారు. శిశువు బరువు 3.4 కిలోలుగా ఉందని చెప్పారు. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించిన ఈ ఐఏఎస్ దంపతులను పలువురు  ప్రశంసిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తెలంగాణ ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని మరింతగా పెంచారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని అంటున్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా వారిని అభినందించారు. సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు ప్రజల మొదటి ఎంపికగా మారడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన ఓ న్యూస్ పేపర్ క్లిప్‌ను కూడా హరీష్ రావు షేర్ చేశారు. 

 


ఇక, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భవేష్ మిశ్రా పేద ప్రజల కోసం ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇలా త్రిపాఠి విషయానికి వస్తే.. లక్నోకు చెందిన ఆమె 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇలా త్రిపాఠి గతంలో మంచిర్యాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పనిచేశారు. సివిల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు ఐటీ ఇంజనీర్‌గా పనిచేశారు. ఇలా త్రిపాఠి కొన్ని పుస్తకాలను కూడా రాశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios