ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో ఎమ్మార్పీ ధరకే విక్రయాలు నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఎమ్మార్పీ ధరలు అమలును పర్యవేక్షించాలని అకున్ సూచించారు. 

వీకెండ్ వస్తే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఏ సినిమాకో వెళ్లాలనుకునే వారు థియేటర్ టిక్కెట్లకు వెళ్లాలంటే జేబులు ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సిన పరిస్థితి.. టిక్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ఇంటర్వెల్‌లో కొనుగోలు చేసే తినుబండారాల రేట్లే ఎక్కువ. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు మల్టీప్లెక్స్‌లకు వెళ్లడమే మానేశారు. ఏ వస్తువైనా, తినుబండారమైనా ఎమ్మార్పీకే విక్రయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ మాల్స్‌ పట్టించుకోవడం లేదు.

ధరల పట్టిక మీద ఎమ్మార్పీ ధరలే కనిపిస్తున్నా.. లోపల మాత్రం విషయం వేరుగా ఉంటుంది. ఈ దోపిడీపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన తెలంగాణ తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సభర్వాల్.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లపై పలు విడతలుగా దాడులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో ఎమ్మార్పీ ధరకే విక్రయాలు నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఎమ్మార్పీ ధరలు అమలును పర్యవేక్షించాలని అకున్ సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎమ్మార్పీతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో ప్యాకింగ్‌లు ఉండేలా చూడాలని చెప్పారు.