తెలంగాణ సీఎం ను ప్రశంసిస్తూ లేఖ రాసిన ఏపీ కాపు ఉద్యమ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటీవల ఏపీ నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతోంది.ఆ మధ్య ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రి చేపల పెంపకంపై చూసిన శ్రద్ధకు ముగ్దుడై తనను ప్రశంసించారని స్వయంగా కేసీఆరే చెప్పుకొచ్చారు.
ఇటీవల ట్విటర్ లో ఓ ఏపీ యువకుడు తెలంగాణ ప్రభుత్వ పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలని కోరాడు.
ఈ లిస్టులో తాజాగా ఏపీకి చెందిన ఓ బలమైన సామాజిక నేత కూడా జాయిన్ అయ్యాడు. ఆయన ఎవరో కాదు ఏపీ సీఎం చంద్రబాబుకు కంటిలో నలుసులా మారిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
ఇటీవల తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మైనారిటీలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చారిత్మక బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
దీనిపై ప్రశంసలు కురిపించిన ముద్రగడ సీఎం కేసీఆర్ ను అభినందిస్తూ ఓ లేఖ ను మీడియాకు విడుదల చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని రిజర్వేషన్లు పెంచి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించారని కొనియాడారు. అదే సమయంలో ఏపీలో కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు తీరుపైన విమర్శలు కురిపించారు. ఇలా తెలంగాణ సీఎంను పొగుడుతూ ఏపీ సీఎంను తెగుడుతూ తన లేఖను ముగించారు ముద్రగడ పద్మనాభం.
