వివాదాస్పద భూమిని అక్రమార్కులకు కట్టబెట్టేందుకు ఏకంగా కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర తహశీల్దార్ నాగరాజు అక్రమార్జన భారీగా బయట పడుతూనే ఉంది.

తాజాగా ఆల్వాల్‌లోని సౌతిండియన్ బ్యాంక్‌లో నాగరాజుకు సంబంధించిన లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు అందులోని రూ.57 లక్షల విలువైన ఆభరణాలను గుర్తించారు. కేజీ వంద గ్రాముల బరువున్న నగలను సీజ్ చేశారు.

Also Read:రూ.1.10 కోట్ల లంచం తీసుకొన్న కీసర తహసీల్దార్ నాగరాజు: గిన్నిస్ బుక్ ‌రికార్డ్స్‌లో చోటుకు ధరఖాస్తు

బావమరిది నాగేందర్ పేరుతో నాగరాజు సౌతిండియన్ బ్యాంక్‌లో బినామీ లాకర్ తెరిచినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు పరారీలో ఉన్న నాగరాజు భార్య కోసం  ఏసీబీ అధికారులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. 

కాగా నాగరాజు నివాసంలో స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఎఫ్ఐఆర్ కాపీలు లభించాయి. పోలీసు స్టేషన్లలో ఉండాల్సిన ఎఫ్ఐఆర్ కాపీలు నాగరాజు వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీలతో నాగరాజుకు ఏం పని అనే ప్రశ్నకు సమాధానం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

Also Read:కీసర తహసీల్ధార్‌కి, శ్రీనాథ్ యాదవ్ కి మధ్య నాగరాజు మధ్యవర్తిత్వం: ఏసీబీ రిమాండ్ రిపోర్టు

నాగరాజు వద్ద సీజ్ చేసినవాటిలో భూపత్రాలు, పహణీలు, సేల్ డీడ్స్, పాసు పుస్తకాలున్నాయి. సేల్ డీడ్స్, పహణీల్లో పేర్లున్న వ్యక్తులను విచారించాలని ఏసీబి అధికారులు భావిస్తున్నారు. నాగరాజు కేసులో సాంకేతిక అంశాలు కీలకంగా మారాయి.

నిందితుల సెల్ ఫోన్లలో సమాచారం నిక్షిప్తమై ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వారి సెల్ ఫోన్లను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించనున్నారు. నాగరాజుకు పోలీసులతో సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.