తెలంగాణలోని కోరుట్ల జర్నలిస్టులకు టిఆర్ఎస్ ఎంపి కవిత శుభవార్త చెప్పారు. కోరుట్లలో జర్నలిస్టుల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు కవిత శంకుస్థాపన చేశారు. సోమవారం కోరుట్ల పట్టణ శివారులో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ కలం కార్మికుల సంక్షేమానికీ టిఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు.

వార్తాసేకరణలో కుటుంబ సభ్యులతో కూడా గడపలేని పరిస్థితిలో కూడా జర్నలిస్టులు విలువలు పాటిస్తూ నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎంపి కవిత జర్నలిస్టులను ప్రశంసించారు. జర్నలిస్టుల సంక్షేమానికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. స్థలం దొరకడం ఆలస్యమయినప్పటికి, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మంచి స్థలం చూశారన్నారు.

కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు, ప్రెస్ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.