హైదరాబాద్: మౌనరాగం టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. శ్రావణి ఆత్మహత్య ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు దేవరాజు రెడ్డిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దేవరాజు రెడ్డి మానసికంగా హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను దేవరాజురెడ్డి ఖండించారు. 

తనపై శ్రావణి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. దేవరాజు రెడ్డి పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. శ్రావణి ఆత్మహత్య ఘటనతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. మూడు రోజుల తర్వాత తన వద్దకు వస్తానని చెప్పిందని ఆయన చెప్పారు. 

కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి హింసించడం వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆయన చెప్పారు. తనను వారు బాధించడాన్ని, హింసించడాన్ని తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆయన అన్నారు. శ్రావణి చివరిసారిగా దేవరాజురెడ్డితో మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. సాయి అనే వ్యక్తి వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రావణి చెప్పిందని ఆయన అన్నారు.

Also Read: ‘మౌనరాగం’ శ్రావణి ఆత్మహత్య, ఫొటోలతో బ్లాక్ మెయిల్

తాను అనుభవిస్తున్న హింసను భరించలేకపోతున్నట్లు శ్రావణి తనకు ఫోన్ చేసి చెప్పిందని ఆయన అన్నారు. గతంలో ఇంట్లోవారి ఒత్తిడి వల్లనే తనపై కేసు పెట్టిందని ఆయన చెప్పారు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని సాయి అనే వ్యక్తి శ్రావణిని బెదిరించాడని ఆయన ఆరోపించారు. తాను, శ్రావణి పోలీసు స్టేషన్ కు వెళ్లామని, తాను కేసును ఉపసంహరించుకుంటానని చెప్పిందని, తనను పెళ్లి చేసుకోవాలని కోరిందని, అయితే తాను పెళ్లి చేసుకుంటే సమస్యలు ప్రారంభమవుతాయని చెప్పానని ఆయన చెప్పారు.

పోలీసు స్టేషన్ నుంచి తాము రెస్టారెంటుకు వెళ్లామని, అక్కడికి సాయి వచ్చాడని, తనపై దాడి చేయడానికి ప్రయత్నించాడని, దాడి నుంచి తనను కాపాడి శ్రావణి అతనితో వెళ్లిపోయిందని దేవరాజు రెడ్డి చెప్పారు. అయితే సాయి శ్రావణిని జుట్టుపట్టుకుని కొట్టాడని ఆయన చెప్పారు. ఇంటికి వెళ్లిన తర్వాత తనకు ఫోన్ చేసి ఆ విషయాలు చెప్పిందని ఆయన అన్నారు. 

తాను ఏ పార్టీ ఇవ్వాలనుకుని తనకు రూ.30 వేలు బదిలీ చేసిందని, దాన్ని చూపించి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, శ్రావణికీ తనకూ మధ్య ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు లేవని దేవరాజు రెడ్డి చెప్పారు. తనను శ్రావణి ఇష్టపడిందని, మనస్ఫూర్తిగా తనను ప్రేమించిందని, అందుకే ఆమెకు ఆ కష్టాలు వచ్చాయని ఆయన అన్నారు.  తన ఫోన్ పోలీసుల వద్దనే ఉందని, తాను పోలీసులకు సహకరిస్తానని ఆయన చెప్పారు.