తెలంగాణ టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సుదీర్ఘ విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయాలన్న కామెంట్స్ చేసి తెర వెనుకకు వెళ్లారు మోత్కుపల్లి. అయితే అప్పటి నుంచి మోత్కుపల్లిని సస్పెండ్ చేయాలంటూ పార్టీలో కేడర్ డిమాండ్ చేశారు. అయితే మోత్కుపల్లిపై వేటు తప్పదన్న ప్రచారం కూడా సాగింది. కానీ రెండురోజులపాటు చంద్రబాబుతో జరిగిన తెలంగాణ టిడిపి నేతల మీటింగ్ లో కూడా మోత్కుపల్లి పాల్గొనలేదు. దీంతో మోత్కుపల్లి పార్టీకి గుడ్ బై చెబుతారా? లేక ఆయనను తొలగిస్తారా అన్న చర్చ అలాగే కొనసాగింది. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చి అనేక అంశాలపై మోత్కుపల్లి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై మరోమారు మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. రేవంత్ కిరాతకుడు అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాశనం కావడానికి రేవంతే కారకుడు అని విమర్శించారు. రేవంత్ ను ఓటుకు నోటు కేసులో దొరికిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి ఉండే అన్నారు. ఇంకా మోత్కుపల్లి ఏం మాట్లాడారో కింద చదవండి.

తెలంగాణ ఉద్యమ సమయంలో నేనే చంద్రబాబుకు అండగా ఉన్నాను. నా జీవితాన్ని ఫణంగా పెట్టి నేను బాబుకు సహకరించాను. తెలంగాణలో పటిష్టమైన నాయకత్వం లేదు. కమిట్ మెంట్ లేని వాళ్లకు నాయకత్వం ఇవ్వడం వల్ల పార్టీ భ్రష్టుపట్టిపోయింది. నాయకత్వం సరిగా లేదు. ఇవ్వాల్సిన వాళ్లం.. నేడు అడుక్కునే దుస్థితికి ఎందుకొచ్చామో ఆలోచించాలి. మీరు నమ్మి ఇచ్చిన వారు నాయకత్వం చేయలేకపోయారు.

ఎవరైతే.. నాయకుడు ఉర్రూతలూగించిండో ఆయనే ఇవాళ సర్వం ముంచిపోయిండు. ముఖ్యమంత్రి అయితా అని చెప్పుకున్న వ్యక్తి కూడా పార్టీని నాశనం చేసి వెళ్లిపోయిండు. రేవంత్ నువ్వు తప్పు చేస్తున్నావని ఎన్నోసార్లు చెప్పిన. నాకంటే చిన్నవాడైనా మందలించాను. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పార్టీ పరువు బజారులో పడేసిండు. నేను ఎవరికీ ద్రోహం చేసే వాడిని కాదు. టిడిపిలో ఉన్నవారెవరికీ ద్రోహం చేయను. ఇవాళ పార్టీ ఏ దశలో ఉందో ఆలోచించాలని చెబుతున్నను. పార్టీలో ఏ పదవి ఇవ్వకపోయినా నేను అడగలేదు విధేయంగా పనిచేశాను. పార్టీని బజారున పడేసిన కిరాకతుడు రేవంత్.

చంద్రబాబు మీద ఈగ వాలినా నేను తట్టుకోలేను. అటువంటి నాయకుడికి తలవంపులు తెచ్చిండు రేవంత్. అటువంటి రేవంత్ ను ఆనాడే సస్పెండ్ చేయకపోవడం ఎంత తప్పో అర్థం చేసుకోవాలి. ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డిని. టిడిపి నాశనం కావడానికి రేవంత్ రెడ్డే కారకుడు.

చంద్రబాబు, ఎన్టీఆర్ వద్ద కూర్చున్న నేను.. ఇవాళ బజారు మనుషులు, బ్రోకర్స్, నీతిలేని మనుషుల వద్ద కూడా కూర్చోవాల్సి రావడం బాధాకరం. పార్టీ నుంచి అందరూ పోయారు. ఐదారుగురు తప్ప ఈ పార్టీలో ఇంకా మిగిలి ఉన్నరా ఎవరైనా..? పార్టీకి నాయకత్వంలో లోపం ఉంది. ఇందులో ఎవరి తప్పూ లేదని చెప్పను. మా నాయకుడు సమయమిస్తే.. మేమే ప్రత్యామ్నాయంగా ఉంటాము. టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ నేడు కాంగ్రెస్ కంటే కిందికి పోయింది. చంద్రబాబు ఆయన బాధల్లో ఆయన ఉన్నారు. ఉన్నదాంట్లో కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది... మిగిలింది ఇంకా టిఆర్ఎస్ పార్టే అని మా నాయకుడే చెప్పాడు.

నాకేం భయం లేదు. నిజంగా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే.. కచ్చితంగా టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను కూడా చెప్పాను. అలా చేస్తే క్యాడర్ కు కూడా నమ్మకం వస్తది. రేవంత్ పార్టీని చీల్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో కేసిఆర్ నాయకుడైండు. కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ పార్టీలకు, ప్రాంతాలకు, మతాలకు అతీమైన నాయకుడు. నేను చేసిన కామెంట్స్ వల్ల ఎవరైనా నాయకులు ఇబ్బంది పడితే క్షమించండి. చంద్రబాబు వస్తే తప్ప ఈ పార్టీ బాగుపడదు. ఆయన రాకపోతే పార్టీ బలపడదు. పది లక్షల మంది కార్యకర్తల కోసమే నేను మాట్లాడాను.

పార్టీ మొత్తంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. బాబు టైం ఇచ్చి బాబు ఈ ప్రాంతంలో తిరిగి కాపాడితే పార్టీ బాగుపడుతుంది తప్ప తెలంగాణ నాయకులే చూసుకోవాలంటే నడవదు. చంద్రబాబు తెలంగాణలో సమయం ఇస్తానని చెప్పడం సంతోషకరం. అలా చేస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం.