నెరవేరని తెలంగాణ ‘తమ్ముడి’ కల
రాజకీయాల్లో కూడా ... ఎప్పుడొచ్చామనేది కాదు.. ఏ పీఠం ఏక్కామనేదే ముఖ్యం... కులం, మతం, ప్రాంతం, ఇలా సవాలక్ష సమీకరణాలు కలిస్తేనే కూర్చోలో కూర్చునే అవకాశం వస్తుంది.
లేదంటే ఇక అంతే సంగతలు... ఖర్చీఫ్ పట్టుకొని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసినా ఏ కూర్చీ దొరకదు.
పాపం... తెలంగాణలోని సీనియర్ తెలుగు ‘తమ్ముడి’ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది.
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ గిరి పై బోలెడు ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.
చంద్రబాబు కూడా... గవర్నర్ గిరి పై మోత్కుపల్లికి చాలా సార్లు బ్రీఫ్ చేశారు. దీంతో ఆయన ఆ కుర్చీపై బోలేడు ఆశలు పెట్టుకున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్ లు మారుతున్నారు. కొత్త గవర్నర్ లు వస్తున్నారు. పాపం.. లిస్టులో మాత్రం మోత్కుపల్లి పేరు కనిపించడం లేదు.
కాలం గడుస్తున్న... కళ్లు కాయలు కాస్తున్న ఆ పోస్టు మాత్రం పోస్టుపోన్ అవుతూనే ఉంది.
ఇప్పటికీ బాబు గారి కరుణిస్తారనే ప్రగాఢ నమ్మకంతో తెలంగాణ తమ్ముడు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో గవర్నర్ రేసులో ఓ తెలుగు వ్యక్తి పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది.
ఆయనే సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు. త్వరలో తమిళనాడు గవర్నర్ గా ఆయన నియమితుడుకానున్నట్లు ఒకటే పుకార్లు.
ఇక సోషల్ మీడియా అయితే అప్పుడే ఆయనకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది.
కానీ, మొదటి నుంచి రేసులో ఉన్న మోత్కపల్లి పేరు మాత్రం ఇప్పుడు వినిపించడటమే లేదు.
ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు వారానికోసారి ఢిల్లీ వెళ్తూనే ఉంటారు. అలా వెళ్లినప్పుడు ఈ తెలంగాణ తమ్ముడి కోరికను కాస్త పెద్దలకు వినిపిస్తే బాగుండేదనేది పార్టీ శ్రేణుల అభిప్రాయం.
అసలే తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయింది. ఒక్క ఎంపీ కూడా ఇప్పుడు పార్టీకి లేకుండా పోయారు. ఇలాంటి సమయంలో తెలంగాణ లో పార్టీని గాలికి వదిలేశారన్న అభిప్రాయం తమ్ముళ్లలో నెలకొనే అవకాశం ఉంది.
కానీ, చంద్రబాబు ఎందుకో ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో బిజీగా ఉండడంతో మరిచిపోయారా.. లేక కావాలనే మరుగున పడేస్తున్నారా అనేదే తెలియడం లేదు.
బహుశా ప్రభాస్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మోత్కుపల్లి వెనుక ఉంటే ఆయన కల ఎప్పుడో నెరవేరేదేమో...
