ఎన్టీఆర్ మృతికి బాబే కారణం, కేసిఆర్ ను పడగొట్టాలని చూశారు: మోత్కుపల్లి

Mothkupalli makes serious allegations on Chnadrababu
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూడా కుట్రలకు బలయ్యారని ఆయన అన్నారు. చంద్రబాబును దొరకని దొంగగా ఆయన అభివర్ణించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ కు సోమవారం నివాళులు అర్పించిన మోత్కుపల్లి ఎన్టీఆర్ ఘాట్ వద్ద బోరున విలపించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

పవన్ కల్యాణ్, జగన్ సొంత జెండాలు పట్టుకున్నారని, వారు మొగోళ్లని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వద్ద చంద్రబాబు టీడిపిని దొంగతనం చేశారని అన్నారు తన రాజకీయ జీవితాన్ని చంద్రబాబు బలి తీసుకున్నారని ఆరోపించారు. అవసరమైతే తాను ఆంధ్రలో రథ యాత్ర చేస్తానని, ఆలేరు ప్రజలే తనను కాపాడుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ దయవల్లనే తనలాంటి పేదవాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. 

చంద్రబాబు రాజీినామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై నిస్సిగ్గుగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చరిత్రలో నల్లపేజీ ఉందని అన్నారు. చంద్రబాబును పాతాళంలోకి తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయకుండా ఆయనను ఓడించాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు.

పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు చంద్రబాబు లొంగిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టారని, అలాగే బీసీలకూ కాపులకు మధ్య చిచ్చు పెట్టారని, చివరకు బ్రాహ్మణుల మధ్య చిచ్చు పెట్టారని ఆయన విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే తాను టీడీపిని వీడేది లేదని అన్నారు.

loader