ఓ తల్లి పత్తి ఏరడానికి వెళ్లివస్తూ.. తన ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసింది.. ఆ తరువాత తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనలో పెద్ద కొడుకు బతికి బయటపడ్డాడు. 

హనుమకొండ : ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విధారకమైన ఘటన హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో వెలుగు చూసింది. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ.. ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. పిల్లల్ని బావిలోకి తోసేసి.. ఆ తర్వాత తాను కూడా దూకేసింది. ఈ ఘటనలో ఆమె చనిపోగా.. చిన్న కొడుకు కూడా మృతి చెందాడు. నడికుడ మండలం కంటాత్మకూరు గ్రామంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన ప్రతి వివరాలు ఇలా ఉన్నాయి. 

కంఠాత్మకూరు గ్రామానికి చెందిన కుమారస్వామితో..వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన మామిడి కావ్య(38)కు పదేళ్ల కిందట పెద్దలు వివాహం చేశారు. వీరికి విద్యాధర్(8), శశిధర్(6) అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిద్దరిది అన్యోన్య దాంపత్యం. పెద్దగా గొడవలు కూడా లేవు. కుమారస్వామి ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండగా.. కావ్య పొలం పనులకు వెళుతుంటుంది. శనివారం నాడు కుమారస్వామి తన ఆటోలో కావ్య తల్లిదండ్రులను తీసుకొని వేములవాడకు వెళ్లాడు.

నాకిచ్చి పెళ్లి చేస్తే దయ్యాన్ని వదలగొడతా.. లేదంటే అది చంపేదాకా వదలదు.. నకిలీబాబా మోసం..

ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటారని తనతో పాటు తీసుకుని ఊరు చివరలో ఉన్న పొలంలో పత్తి ఏరడానికి వెళ్ళింది కావ్య. పత్తి ఏరిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ మధ్యలో ఓ వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లింది.. అక్కడే పిల్లలు ఇద్దరినీ బావిలోకి తోసేసి.. తాను కూడా దూకింది. ఈ ఘటనలో కావ్యతోపాటు చిన్న కొడుకు శశిధర్ కూడా చనిపోయాడు. 

పెద్ద కొడుకు విద్యాధర్ మాత్రం బావిలో పడే సమయంలో బావిలోని మోటార్ పైపును పట్టుకున్నాడు. దీంతో మునిగిపోకుండా ఉండి గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. బావిలో నుంచి కేకలు రావడం గమనించిన అటుగా వెళ్తున్న వారు.. వెంటనే బావి దగ్గరికి వచ్చి గమనించి విద్యాధర్ ను బయటికి తీశారు. దీంతో అతని తల్లి చేసిన పని వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కావ్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను స్థానికులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. 

నల్లగా ఉన్నానని విమర్శలు.. అగ్గిలా మారతాను: గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ హెచ్చరిక..

బావిలో గాలించగా తల్లి కుమారుడి మృతదేహాలు లభించాయి. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కావ్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. మరోవైపు కుటుంబ కలహాలతోనే కావ్య ఆత్మహత్య చేసుకునే ఉండొచ్చని కూడా సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఘటన మీద పోలీసులు కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. వారి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.