తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన కామెంట్స్ చేశారు. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన కామెంట్స్ చేశారు. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నల్లగా ఉన్నానని అంటే.. అగ్గిలా మారతానని హెచ్చరించారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తాజాగా చెన్నైలోని తాండయార్‌పేటలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తన చేతుల మీదుగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు తన జీవితంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారు.
తన రంగు నలుపు అని, తన నుదురు బట్టతలలా ఉందని కొంతమంది పదే పదే విమర్శలు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నలుపు అంటే అగ్గిలా మారి వణికిస్తానని అన్నారు. తనను విమర్శించేవారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని వ్యాఖ్యానించారు. తనపై చేసే విమర్శలను పట్టించుకోనని అన్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయిపల్లవి దేవదాసి పాత్రలో అందంగా లేదంటూ వచ్చిన వార్తపై గవర్నర్ తమిళిసై ఘాటుగా స్పందించారు. సాయిపల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలకు పాల్పడటం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు. గతంలో తాను కూడా ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నానని చెప్పారు. ఎగతాళి చేసేవారికి ఎదుటి వారి భాద తెలియదని.. తానూ చాలా బాధపడ్డానని చెప్పారు. అయితే ప్రతిభ, శ్రమతో వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇలాంటి కామెంట్స్ చేసేవారి ఉద్దేశం మహిళలను నిరుత్సాహపరచడం, బలహీనపరచడం, నాశనం చేయడం అని మండిపడ్డారు. మహిళలు ఎల్లప్పుడూ తమ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించాలని సూచించారు.
