బిడ్డలంటే... తల్లికి  అమితమైన ప్రేమ ఉంటుంది. వాళ్లు ఏం  చేసినా మురిసిపోతారు. చిన్న గాయమైనా చూసి తట్టుకోలేరు. తప్పు చేస్తే.. కడుపులో పెట్టుకొని దాచుకుంటారు. అయితే... ఓ తల్లి మాత్రం కొడుకు జులాయిలాగా ఏ  పనిచేయకుండా తిరుగుతూ ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది. అందుకే.. తన చేతులతో తానే చంపేసింది. కానీ బయటి ప్రపంచానికి మాత్రం కొడుకు మతిస్థిమితం లేక చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  పల్లెతండాకు చెందిన యువకుడు ఇస్లావత్ హరిలాల్(20) జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. దీంతో... అతని తిరుగుళ్లు చూసి విసిగిపోయిన అతని తల్లి చాంది.. తన చేతులతో తానే హత్య చేసింది. అతని మెడకు చున్నీ బిగించి.. ఉరివేసింది. అనంతరం మృతదేహాన్ని తీసుకువెళ్లి ముళ్ల పొదల్లో పడేసింది.

బయటకు ప్రజలకు మాత్రం కొడుకుకి సరిగా మతిస్థిమితం లేదని.. భోజనానికి కూడా ఇంటికి వచ్చేవాడని.. ఎలా చనిపోయాడో తనకు తెలియదని ఊరు ప్రజలను నమ్మించింది. అయితే... పొస్టుమార్టంలో మాత్రం అది హత్యగా తేలింది. తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన రీతిలో విచారించగా... అసలు నిజం వెలుగు చూసింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.