సికింద్రాబాద్‌ నుండి ఎంపీగా పోటీ చేస్తా: మాజీ క్రికెటర్ అజారుద్దీన్

Mohammad Azharuddin keen to contest 2019 poll from Secunderabad in Telangana
Highlights

2019 ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తానని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి  పోటీ చేయాలని తనను పలువురు నేతలు కోరినట్టు కూడ ఆయన చెప్పారు


హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తానని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి  పోటీ చేయాలని తనను పలువురు నేతలు కోరినట్టు కూడ ఆయన చెప్పారు.ఈ విషయమై తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి కూడ చెప్పానని ఆయన ప్రకటించారు.

ఆదివారం నాడు ఆయన ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.  తెలంగాణ నుండి తాను బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంనుండి పోటీ చేయాలని తాను కోరుకొంటున్నట్టు ఆయన చెప్పారు.ఈ  విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీకి కూడ చెప్పానని ఆయన గుర్తు చేశారు. 

గతంలో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున అజారుద్దీన్  ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.  అయితే ఈ దఫా మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున  తెలంగాణ నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేయాలని గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు అజారుద్దీన్ ను కోరారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా కూడ స్పందించారు.

తెలంగాణలో సెలబ్రిటీలను  కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ  అజారుద్దీన్ తో పాటు సినీ నటి విజయశాంతికి పార్టీలో కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ నుండి పోటీ చేసేందుకు తనకున్న ఆసక్తిని అజారుద్దీన్ వ్యక్తం చేయడంతో  రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున అంజన్ కుమార్ యాదవ్  రెండు దఫాలు ఎంపీగా విజయం సాధించారు. 

అయితే గత ఎన్నికల్లో  అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో అజారుద్దీన్ ఈ స్థానం నుండి పోటీ చేయాలనే ఆసక్తిని చూపుతుండడంతో  కాంగ్రెస్ పార్టీ  అంజన్ కుమార్ ను కాదని అజహారుద్దీన్ కు టిక్కెట్టు కేటాయించే అవకాశం ఉంటుందా... లేదా అనేది ఇప్పటికిప్పుడు మాత్రం చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


 

loader