సికింద్రాబాద్ నుంచి జనగామకు లోకల్ ట్రైన్ మంజూరు చేయించాలి.. కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ పోచంపల్లి లేఖ..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ నుంచి జనగామకు లోకల్ ట్రైన్ మంజూరు చేయాలని, ఎంఎంటీఎస్ ట్రైన్ జనగామ వరకు పొడిగించాలని కోరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ నుంచి జనగామకు లోకల్ ట్రైన్ మంజూరు చేయాలని, ఎంఎంటీఎస్ ట్రైన్ జనగామ వరకు పొడిగించాలని కోరారు. జనగామ జిల్లా కేంద్రం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు లోకల్ ట్రైన్ మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారని లేఖలో శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రాజధాని నగరానికి సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటి అని చెప్పారు. జనగామ జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్ వెళ్తుంటారని తెలిపారు.
జనగామ, ఆలేరు, భువనగిరి పట్టణాలతోపాటు, పెంబర్తి, వంగపల్లి, రాయగిరి, బీబీనగర్, ఘట్కేసర్‌ల నుంచి వ్యక్తిగత పనుల మీద, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, రోజు వారి కూలీలు, వివిధ షాపులలో పనిచేసేవారు, వ్యాపారపరంగా వెళ్ళేవారు ఇలా వేలాది మంది నిత్యం ట్రైన్లలో జనగామ నుంచి హైదరాబాద్ వెళ్తుంటారని చెప్పారు. అయితే వారు అనునిత్యం వ్యయప్రయాసలకోర్చి, చిరు సంపాదనతో జీవితాలు వెల్లదీసుకుంటున్నారని అన్నారు.
విపరీతమైన రోజు వారి ప్రయాణ ఖర్చులు భరించుకోలేకపోతున్నారని లేఖలో ప్రస్తావించారు. ట్రైన్ ప్రయాణమైతే సీజన్ టిక్కెట్‌తో వారికి సౌకర్యంగా వుంటుంది. అందుకే ఎక్కువ మంది చిరుద్యోగులు, వ్యాపారులు రైలు ప్రయాణం కోరుకుంటున్నారని తెలిపారు.