MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీ  చేయ‌డంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత స్పందిస్తూ.. ఈ చర్యను కేంద్ర ప్రభుత్వ బెదిరింపు ఎత్తుగడగా అభివర్ణించారు. గురువారం (మార్చి 9న‌) విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌నీ, 15న హాజ‌రవుతాన‌ని ఆమె ఈడీకి చెప్పారు.  

Delhi excise policy case-MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్ర‌స్తావిస్తూ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో మార్చి 10 ధ‌ర్నాకు దిగ‌నున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో తాజాగా ఆమెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లను జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచార‌ణ‌లో భాగంగా త‌మముందు హాజ‌రుకావాల‌ని కోరింది. ఈ దీక్ష‌ను ప్ర‌స్తావిస్తూ రాష్ట్ర బీజేపీ నాయ‌కులు క‌విత‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు నుంచి దృష్టి మ‌ర‌ల్చ‌డానికే ఈ దీక్ష అంటూ విమ‌ర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన ధర్నా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమె ప్రమేయం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమని బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఆరోపించారు. 

ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచిన నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అయిన అర‌వింద్.. క‌విత‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత ఢిల్లీలో తలపెట్టిన ధర్నాను ప్రహసనంగా అభివర్ణించిన బీజేపీ నేత తన మంత్రివర్గంలో 33 శాతం మహిళలకు చోటు కల్పించేలా తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఒప్పించాలని సూచించారు.

"2014 నుంచి 2018 వరకు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవితకు పార్టీలో కుటుంబ‌ ఆధిపత్యం ఉందనే కారణంతో కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళ కూడా చోటు దక్కించుకోలేకపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం, ఆ తర్వాత బంధుప్రీతి కోటాలో ఎమ్మెల్సీ కావడం, ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఎదిగిన ఆమె హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాలని పిలుపునివ్వడం ప్రజల దృష్టిని మరల్చడానికి ఆమె చేసిన పనికిమాలిన ప్రయత్నం" అంటూ ఎంపీ అర‌వింద్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

కాగా, ఈడీ సమన్లు జారీ చేసిన తర్వాత కవిత స్పందిస్తూ.. కేంద్రంపై విమ‌ర్శ‌లు చేశారు. ప్రజా వ్యతిరేకత, అణచివేత చర్యలకు తెలంగాణ ఎప్పుడూ తలవంచదని చెప్పారు. ఇలాంటి చర్యలతో కేసీఆర్, బీఆర్ఎస్ ను లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎండడగడుతూనే ఉంటామని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తనకు ఈడీ అధికారులు ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. 

గురువారం (మార్చి 9న‌) ఈడీ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌నీ, 15న హాజ‌రవుతాన‌ని ఆమె ఈడీకి చెప్పారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయని ఆమె ఈడీకి వివరణ ఇచ్చారు. అయితే, ఇంకా దీనిపై ఈడీ స్పందన తెలియ‌జేయ‌లేదు.