జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఇటీవల ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. కాగా.. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ తండాకి చెందిన స్వాతి(25)కి కొంతకాలం క్రితం పెళ్లయ్యింది. కాగా.. ఆమె భర్త అనుకోకుండా ప్రాణాలు కోల్పోయాడు. 

దీంతో స్వాతి.. తన ఇద్దరు పిల్లలతో కలసి తిమ్మాపూర్ ‌తండాలోని తల్లి గారింట్లో ఉంటోంది. ఇంట్లో జరిగే శుభకార్యానికి అవసరమైన వస్తువులు కొనేందుకు కుటుంబసభ్యులతో కలసి మెట్‌పల్లికి వెళ్లింది. తిరిగి రాత్రి బస్సులో తండాలోని బస్‌స్టాప్‌ వద్ద దిగారు. అదే సమయంలో అక్కడికి బైక్‌పై హెల్మెట్‌ ధరించి ఉన్న ఓ వ్యక్తి వచ్చి స్వాతి ముఖంపై యాసిడ్‌ పోసి పరారయ్యాడు.

ఈ సంఘటనలో ఆమె కుడి వైపు చెంప, మెడ, భుజం వద్ద గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వాహనంలో మెట్‌పల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ సింధు శర్మకు ఫోన్‌ చేసి ఘాతుకానికి పాల్పడ్డ నిందితున్ని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు.