కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇలాగైనా మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని అధికార బి ఆర్ ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది.

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఎన్నికల వ్యూహరచనపై కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలకు గాలం వేసేందుకు మంతనాలు జరుగుతుంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలతో హస్తం పార్టీ చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావంతమైన నేత మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అసమ్మతి నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి శుక్రవారం బెంగళూరు వెళ్ళిన విషయం తెలిసిందే. 

ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. అంతేకాకుండా.. తామిద్దరం కృప గెస్ట్ హౌస్ లో కలిసామని, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై, రాబోయే ఎన్నికలపై చర్చించామని కర్ణాటక డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అయితే వీరిద్దరూ ఏఏ అంశాలను చర్చించారనేది సర్వత్ర ఉత్కంఠగా మారింది. 

ఇదిలా ఉంటే.. కర్ణాటక డిప్యూటీ సీఎం, రేవంత్ రెడ్డి భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. 'అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ కానీ ఇప్పుడు వయా బెంగుళూర్. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Scroll to load tweet…

కాగా, వైయస్ షర్మిల పార్టీ అయినా వైయస్సార్ టీపీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలన్నిటికీ ఆజ్యం పోస్తున్నట్లుగా వైయస్సార్ టిపి అధినేత్రి వైయస్ షర్మిల తాజాగా హస్తినాలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలిసి ప్రత్యేక భేటీ అయ్యారు.