ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఢిల్లీలో కవిత ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈడీ నోటీసులు అందాయని చెప్పారు. తెలంగాణలో నవంబర్‌లో లేదా డిసెంబర్‌లో ఎన్నికల రావొచ్చని అన్నారు. ఎక్కడైనా ఎన్నికలు ఉంటే మోదీ కంటే ముందు ఈడీ వస్తుందని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో మార్చి 10న నిరాహారదీక్ష చేపట్టనున్నట్టుగా హైదరాబాద్‌లో మార్చి 2న పోస్టర్‌ను విడుదల చేశామని చెప్పారు. తమ నిరసనకు 18 పార్టీలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయని తెలిపారు.

అయితే మారచి 9న విచారణకు రావాల్సిందిగా ఈడీ తనను పిలిచిందని చెప్పారు. ఈడీ ఎందుకు తొందరపడుందో అర్థం కావడం లేదని అన్నారు. తాను 16వ తేదీన విచారణకు వస్తానని అభ్యర్థించానని.. కానీ వారు అంగీకరించలేదని చెప్పారు. తర్వాత తాను మార్చి 11వ తేదీన విచారణకు అంగీకరించానని చెప్పారు. ఒక ఏజెన్సీ ఒక మహిళను విచారించాలనుకున్నప్పుడు.. ఆమెకు ఇంటికి వచ్చి విచారించాలని చట్టం చెబుతుందని అన్నారు. ఈ క్రమంలోనే మార్చి 11న తన ఇంటికి రావచ్చని తాను ఈడీని అభ్యర్థించానని తెలిపారు. అయితే తానే వారి వద్దకు రావాల్సి ఉంటుందని వారు చెప్పారని వెల్లడించారు. 

తాను ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని కవిత తెలిపారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సత్యం, న్యాయం, ధర్మం తమ వైపే ఉన్నాయని అన్నారు. ఈడీ విచారణకు సహకరిస్తానని చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. తెలంగాణ నేతలను వేధించడం కేంద్రానికి అలవాటైపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందని.. అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్ చేశారని అన్నారు.