MLC Election Results 2025 : చదువుకున్న తెలుగోళ్ళ తీర్పు ఇదే ... ఎక్కడ ఎవరిని గెలిపించారో చూడండి

తెలుగు రాష్ట్రాల్లోని విద్యావంతులంతా ఎన్డిఏ కూటమివైపే నిలిచారు. ఇందుకు తగ్గట్లుగానే ఇరు రాష్ట్రాల్లోని గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు వెలువడుతోంది. ఆరు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. 

MLC Election Results 2025: NDA Alliance Dominates Telugu States, Wins 3 Out of 5 Seats, Full List of Winners in telugu akp

MLC Election Results 2025 : తెలుగు రాష్ట్రాల్లో విద్యావంతులు విచిత్రమైన తీర్పు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఊహించిన ఫలితమే వచ్చింది... అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష బిజెపి సత్తాచాటింది. ఇరు రాష్ట్రాల్లోనూ పిఆర్టియు (Progressive Recognized Teacher's Union) అభ్యర్థులు ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని సాధించారు. 

తెలంగాణలో ఇప్పటికే బిజెపి మద్దతిచ్చిన ఓ ఎమ్మెల్సీ విజయం సాధించగా మరో ఎమ్మెల్సీ స్థానం కూడా బిజెపికే దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బిజెపి ఖాతాలో పడేలా కనిపిస్తోంది. మరోస్థానంలో పిఆర్టియు ఇప్పటికే విజయం సాధించింది. 

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని అధికార టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలుచుకుంది. ఇంకో స్థానంలో పిఆర్టియు అభ్యర్థి విజయం సాధించాడు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలవి... ఇందులో సత్తాచాటి ప్రజలకు తమపై నమ్మకం ఏమాత్రం తగ్గలేదని కూటమి నిరూపించుకుంది. 

ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు : 

1. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిడిపిదే : 

ఉమ్మడి కృష్ణా,గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో ఇటీవల పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. గత ఫిబ్రవరి 28న పోలింగ్ జరగ్గా మార్చ్ 3 అంటే సోమవారం ఓట్ల లెక్కిపు సాగింది. నిన్నంతా ఓట్లలెక్కింపు జరగ్గా ఇవాళ (మార్చి 4,మంగళవారం) ఉదయానికి రెండు స్థానాల ఫలితం వెలువడింది. అందులో కృష్ణా,గుంటూరు స్థానం ఒకటి. 

ఉమ్మడి కృష్ఱా‌-గుంటూరు జిల్లాలో అధికార కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేద్రప్రసాద్ బరిలోకి దిగారు. ఈ స్థానంలో మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 21,577 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. తొమ్మిదవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు 1,45,057 ఓట్లు వచ్చాయి. పోలయి చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతానికి పైగా ఆలపాటికి రావడంతో విజేతగా తేల్చారు.  

2. తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం : 

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా కూటమికే దక్కింది.  ఇటీవల  జరిగిన పోలింగ్ లో 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నిన్న(సోమవారం) ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి కూటమి అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖరం విజయం ఖాయమయ్యింది. విజయానికి కావాల్సిన 51 శాతం ఓట్లు సాధించడంలో ఆయనను విజేతగా తేల్చారు. పోలయి చెల్లుబాటయిన ఓట్లలో రాజశేఖరం 1,12,331 ఓట్లు సాధించగా ప్రత్యర్థి దిడ్ల వీర రాఘవులు 41,268 ఓట్లు పొందారు. ఇంకా ఓట్లలెక్కింపు మిగిలివుండగానే రాజశేఖరం విజయాన్ని సాధించారు.

3. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ పలితం : 

ఉత్తరాంధ్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు విజయం సాధించింది. ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలు జరిగాయి. విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో నిన్న(సోమవారం) ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇవాళ(మంగళవారం) ఉదయానికే ఈ పలితం ఖరారయ్యింది.  

మొదటి ప్రాధాన్యత ఓట్లతో పలితం తేలకపోడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఇందులో పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. మొత్తం 20,783 ఓట్లు ఉండగా అందులో 1000కి పైగా ఓట్లు చెల్లలేవు... దీంతో సరిగ్గా ఉన్న 19,813 ఓట్లు మాత్రమే లెక్కించారు. ఇందులో 10,068 ఓట్లకు పైగా అంటే 51 శాతానికి పైగా ఓట్లు సాధించిన గాదె శ్రీనివాసులును విజేతగా తేల్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు ఓటమి తప్పలేదు. 

తెలంగాణఎమ్మెల్సీ ఎన్నికల పలితాలు :

1. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ : 

ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంది. బిజెపి బలపర్చిన అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. తెలంగాణ పిఆర్టియూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై కొమరయ్య 5,777 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25,041 ఓట్లు పోలవగా అందులో 897 ఓట్లు చెల్లలేదు... వాటిని పక్కనబెట్టి 24,144 ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇందులో మొదటి ప్రాధాన్యలోనే కొమరయ్యకు 12,959 ఓట్లు అంటే 51 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనను విజేతగా ప్రకటించారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘోత్తంరెడ్డి కూడా పోటీచేయగా ఆయనకు కేవలం 428 ఓట్లు మాత్రమే వచ్చాయి. వంగ మహేందర్ రెడ్డి 7,182, అశోక్ కుమార్ 2,621 మెరుగైన ఓట్లు సాధించారు. 

2. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ పలితం: 

ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం పిఆర్టియూ వశం అయ్యింది. తెలంగాణ పిఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి ఇక్కడినుండి పోటీచేసి విజయం సాధించారు. ఆయన రెండో  ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. 

మొత్తం 25,797 ఓట్లు పోలవగా ఇందులో చెల్లుబాటు అయ్యేవి 24,135 మాత్రమే. ఇందులో విజయం కోసం 11,281(50 శాతం) ఓట్లు కావాలి. మొదట ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి కేవలం 6,035 మాత్రమే వచ్చాయి. విజయానికి ఇంకా 5,246 ఓట్లు అవసరం ఉండటంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఇలా ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టాగా శ్రీపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు 13,969 కి చేరింది. దీంతో ఆయన ఓట్లు 50 శాతం దాటడంతో విజేతగా తేల్చారు. 

3.మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ : 

ఉమ్మడి కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ స్థానంలో ఓ టీచర్, ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. ఇప్పటికే ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బిజెపి అభ్యర్థి కొమరయ్య విజయం సాధించగా గ్రాడ్యుయేట్ స్థానం కూడా బిజెపికే దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే నిన్న(మంగళవారం) ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మార్చి 5 బుధవారం నాటికి ఈ ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. 

ఇక్కడ మొత్తం 2,50,106 మంది పట్టభద్రుతు ఓటుహక్కును వినియోగించుకున్నారు. నిన్నటి నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క ఓటును కూడా లెక్కించలేదు... ఇప్పటివరకు బ్యాలెట్ పత్రాలను పరిశీలించి చెల్లనివి పక్కనబెట్టి చెల్లేవి కట్టులుకట్టే పనిలోనే సిబ్బంది ఉన్నారు.కాబట్టి ఈ ఫలితం వెలువడేందుకు చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. 

అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి గెలిచే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థానంలో చాలామంది అభ్యర్థులు పోటీపడ్డా ప్రధాన పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని చెబుతున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios