తెలంగాణలో నెంబర్ 1 కేసంస్కారి, సంస్కార హీనుడంటే కేసిఆరే తోకముడిచింది కాంగ్రెస్ కాదు కేసిఆర్ సర్కారే అసెంబ్లీలో తేల్చుకునేందుకు నేను సిద్ధం

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డిపై టిఆర్ఎస్ ఘాటుగా విమర్శలు గుప్పించింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వంశీపై విరుచుకుపడ్డారు. దీంతో వారికి వంశీ కూడా అదేరీతిలో కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఒక్కో ఆరోపణకు వంశీ వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లోనే...

మంత్రి జూపల్లిని ఒక్కసారి చెంచా అంటే నేను సంస్కార హీనుడను ఐతే, మరి అనేక వొందల సార్లు బచ్చా, చెంచా, లుచ్చా, లఫంగా, బేవకూఫ్, బద్మాష్, సన్నాసి, భీకార్ గాడు, లత్కోరు, బేకార్ గాడు ఇలాంటి మాటలు అన్న ముఖ్యమంత్రిని మీరు ఏమంటారు? మీ లెక్క ప్రకారం తెలంగాణలో అత్యంత సంస్కార హీనుడు, అందరికన్నా కుసంస్కారి కె.సి.ఆర్ అని చెప్పొచ్చు కదా.? ప్రజా ప్రయోజనాలను వొదిలి, రైతుల పక్షం వొదిలి కల్వకుర్తి ఆయకట్టు తొలగిస్తే మాట్లాడక, మనకు హక్కు ఉన్న నీటిని అక్రమంగా తరలిస్తే మాట్లాడే ధైర్యం చేయక మన ప్రాంతానికి ద్రోహం చేసే వ్యక్తికి గులాంగిరి చేస్తే "చెంచా" అనక, ప్రాంతానికి మొసంచేసేవారిని "ద్రోహి" అనక ఏమనాలో మీ ముఖ్యమంత్రిని అడిగి చెప్పండి.

వంశీ నిజాలను కప్పిపుచ్చుతూ అబద్దాలు అడుతున్నాడు అన్నారు...

నేను ప్రస్తావించిన అంశంలో ఏ ఒక్క అబద్ధం ఉన్న నేను ముక్కు నేలకు రాయనికే సిద్ధం. 25.01.2017 నాడు విడుదల చేసిన ఉత్తర్వులు No.SE/RBLISP/PBR/TS/MGKLIS/P29/D82/HPs/1773B ద్వారా కల్వకుర్తికి నీరందించే D82 కాలువ సామర్ధ్యాన్ని తగ్గించి 37,742 ఎకరాల ఆయకట్టుని తొలగించింది వాస్తవం కాదా? మీరందరు 22.02.2016 నాడు ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరంలో డిండి కి నీళ్లు తరలిస్తే పాలమూరు, రంగా రెడ్డి జిల్లాలలో రాజకీయ అశాంతి నెలకొంటదని రాయలేదా? పాలమూరు-రంగా రేడ్డి నుంచి ఏ ఇతర ప్రాజెక్టు లకు నీళ్లు తరలించొద్దు అని ఆ ఉత్తరంలో మీరు రాయలేదా?

వంశీ గతంలో సమైక్య రాగం పాడిండు అన్నారు...

ఇది మీ కుటిల రాజకీయాలకు నిదర్శనం. సాగునీటి అంశంపై నన్ను ఎదుర్కునే దమ్ములేక ఆడుతున్న నాటకం. ఒక పత్రిక తప్పుగా ప్రచురించిన వార్తను పట్టుకోని కుళ్లు రాజకీయాలు చేస్తున్నారు. ఆ వార్త తప్పు అని, పొరపాటున ప్రచురితమైందని మర్నాడు అదే పత్రిక వివరణ కూడా ఇచ్చింది. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులు, మీ కె.సి.ఆర్ కుటుంబాన్ని బండ బూతులు తిట్టినోళ్లు, తెలంగాణపై విషం కక్కినోళ్లు, తెలంగాణ వాదులను కొట్టినోళ్లు, ఉద్యమ సమయంలో విద్యార్ధులపై దాడి చేసినోళ్లు ఇప్పుడు మీ మంత్రివర్గంలో ఉండటాన్ని మీరు ఎట్ల సమర్దించుకుంటారు? సమైక్య నినాదంతో ఎన్నికల్లో గెలిచిన YSRCP MP, MLA లను పార్టీలో చేర్చుకోవడం ఎలా సమర్ధించుకుంటారు?

అసెంబ్లీ లో ముఖ్యమంత్రి ప్రెసెంటషన్ పెడితే కాంగ్రెస్ తోకముడిచిందన్నారు...

ఇది మీ రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. మేము ఆనాడు ముఖ్యమంత్రే కాదు మేము కూడా ప్రెసెంటషన్ ఇస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వాలని అడిగితే, ముఖ్యమంత్రే ఏకపక్షంగా దొంగతనంగా తను ఒక్కడే ప్రెసెంటేషన్ ఇచ్చి పారిపోయారు.

పెద్దవారిని దూషిస్తే తాను పెద్దవాడినవుతానని ఆరాటం వంశీదన్నారు...

మీరు పదవులలో పెద్దవాళ్ళు కావొచ్చు కానీ వ్యక్తిత్వంలో ప్రజాలపక్షాన నిలబడటంలో నాకన్నా పెద్దవాళ్ళు కాదు. ధనార్జనలో పెద్దవాళ్ళు కావొచ్చుకాని ప్రజలకోసం దమ్ముతో పోరాటం చేయటంలో కాదు. నా ప్రాంత రైతాంగానికి, ప్రజలకు అన్యాయం చేసే ఎవ్వరినైనా, ఎంతడివారినైన ఉపేక్షించేది లేదు.

*నియోజకవర్గాన్ని పట్టించుకోని వంశీ అన్నారు...

నేను నియోజకవర్గాన్ని పట్టించుకుంటున్నానో లేదో, కల్వకుర్తి ప్రజలు ఎవరివైపు ఉన్నారో నన్ను కాదు మీ ముఖ్యమంత్రిని అడగండి. కల్వకుర్తిలో 2019 కూడా మళ్లీ వంశీ గెలుస్తాడాని మీ ముఖ్యమంత్రి సర్వేనే చెబుతుంది. శాసనసభలో తేల్చుకుందామన్నారు కదా? నేను సిద్ధం. ఇప్పటికే దీనిపై లఘు చర్చకోసం నేను రాసిన ఉత్తరం మీకే పంపిస్తా. ఇరిగేషన్ మంత్రి గారే శాసనసభ వ్యవహారాల మంత్రి. వారికి చెప్పి మీరు లఘు చర్చకు అనుమతి ఇప్పంచండి. అసెంబ్లీ సాక్షిగా తేల్చుకుందాం. అని వంశీ మరో సవాల్ విసిరారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి