మహబూబాబాద్‌ మండలం అమనగల్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓ రైతుకు పాదాభివందనం చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతు వద్ది సుదర్శన్‌రెడ్డికి మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అలా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో పీహెచ్‌సీ ఉపకేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 

రూ.30 లక్షల విలువైన 24 గుంటల భూమిని విరాళంగా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో సోమవారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ స్వయంగా గ్రామానికి చేరుకుని ఆ స్థలంలో పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని రైతు వద్ది సుదర్శన్‌రెడ్డి స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. స్థలదాత వద్ది సుదర్శన్‌రెడ్డికి పాదాభివందనం చేశారు. 

అనంతరం అమనగల్‌, జంగిలిగొండ గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. సర్పంచ్‌లు యాస రమవెంకట్‌రెడ్డి, పూజారి మంగమ్మ వెంకన్న, ఇస్లావత్‌ నీలవేణిహరినాయక్‌, సాయిలు, వెంకన్న, బోడ లక్ష్మణ్‌, వైస్‌ ఎంపీపీ ఎల్ధి మల్లయ్య, జడ్పీటీసీ లూనావత్‌ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.