గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బ్యారక్‌ను మార్చారు చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు. అలాగే జైలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పెంచారు . దీనితో పాటు రాజాసింగ్‌ను కలిసేందుకు వస్తున్న వారిపైనా నిఘా పెట్టారు. 

చర్లపల్లి సెంట్రల్ జైలులో వున్న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బ్యారక్ మార్చారు అధికారులు. మానస బ్యారక్ నుంచి శారద బ్యారక్‌కు మార్చారు. అలాగే జైలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పెంచారు . రాజాసింగ్ విషయంలో అన్నీ గోప్యంగా వుంచుతున్నారు జైలు అధికారులు. జైల్లో రాజాసింగ్‌ను కలవడానికి వస్తున్న వారిని కూడా ఆరా తీస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. 

ఇకపోతే.. రాజాసింగ్ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. బిజెపి క్రమశిక్షణ కమిటీ.. రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ ఆయనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ గడువు రేపటితో ముగియనుండడంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీకి ఉషాబాయి లేఖ రాశారు. రాజాసింగ్ జైలులో ఉన్నారని తన సస్పెన్షన్ రేపటితో ముగియనుండటంతో సమయం ఇవ్వాలని కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ని ఇటీవల పీడీ చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు. 

ALso REad:బీజేపీ-ముక్త్ భారత్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయా?.. గత అనుభవం ఏం చెబుతుంది?

ఇదిలా ఉండగా, మహమ్మద్ ప్రవక్త పై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఆగస్టు 30న మండిపడ్డారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని ఆరోపించారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అధికార పార్టీ తెలంగాణ యూనిట్ షోకాజ్ నోటీసులు పంపించింది. అనేక ఎఫ్ఐఆర్ లు, నగర వ్యాప్తంగా నిరసనలు, ఆగస్టు 23న అతని అరెస్టుకు విఫలయత్నం చేసిన తర్వాత.. చివరకు ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ ను నగర పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఆందోళనలు, నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజాసింగ్ పై అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయి. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అవి మరింత ముదిరాయి. పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రాజాసింగ్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే బిజెపికి చెందిన పలువురు నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణమయ్యారు.