హైదరాబాద్:గుజరాత్ లో ఏర్పాటుచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా... తెలంగాణలో కూడా మరో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

 మూడు నెలలు రాజకీయాలకు విరామం ప్రకటించిన జగ్గారెడ్డి గాంధీ విగ్రహం పనుల్లో నిమగ్నమయ్యారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 130 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

ప్రపంచ దేశాలన్నీ గాంధేయ మార్గాన్ని అనుసరిస్తున్నాయని దేశంలో కూడా మరిన్ని గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐదు ఎకరాల భూసేకరణ చేసి త్వరలోనే పిసిసి చీఫ్ సహా కాంగ్రెస్ ముఖ్యనేతలతో భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 గాంధేయవాదాన్ని అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంగానే గాంధీ విగ్రహం తో పాటు మరో ముగ్గురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 వీలైనంత త్వరలోనే గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా హర్యానా కు చెందిన ఓ కంపెనీ నుంచి కొటేషన్లను కూడా జగ్గారెడ్డి స్వీకరించారు.త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ సంగారెడ్డిలో మొదలుకానుంది. గాంధేయ వాదాన్ని అందరికీ తెలియ చెసి స్ఫూర్తి నింపేందుకే తాను గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Also read:మూడు నెలలు నో పాలిటిక్స్.....ప్లీజ్: జగ్గారెడ్డి సంచలనం

గుజరాత్ రాష్ట్రంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం  తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడ సంగారెడ్డిలో గాంధీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్నారు.