సంగారెడ్డి: రాజకీయాల్లో నిత్యం చురుగ్గా ఉండే ప్రజాప్రతినిధులు ప్రతిరోజు పొలిటికల్ కామెంట్స్ చేయడం పరిపాటి. అందులో ప్రతిపక్ష పార్టీ అయితే  మరింత కామన్. అవకాశం దొరికితే అధికార పార్టీని టార్గెట్ చేయడమే వారి లక్ష్యం. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, అధికారంలో ఉన్న పార్టీ తప్పులను ఎత్తి చూపడం వంటి అంశాలు విపక్ష పార్టీల నేతలకు సర్వసాధారణం.

కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల పాటు రాజకీయాల గురించి మాట్లాడ రాదని నిర్ణయించుకున్నారునియోజకవర్గ  ప్రజా సమస్యలపై రాబోయే మూడు నెలలు దృష్టి పెడతానని తేల్చి చెప్పారు. అధికార పార్టీపై  ఎప్పుడూ విరుచుకు పడే జగ్గారెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.

 జగ్గారెడ్డి నిర్ణయం వెనుక కారణం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏమైనా మారే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టం కడతారన్న  ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో జగ్గారెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.టిఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు ని రెగ్యులర్ గా  టార్గెట్ చేసే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల అనంతరం హరీష్ రావు కూడా అభినందించారు.

మూడు నెలలు రాజకీయాల గురించి మాట్లాడను అని తేల్చి చెప్పడంతో  రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయా.. లేదంటే  జగ్గారెడ్డి కారెక్కుతారని అప్పట్లో జరిగిన ప్రచారం నిజం అవుతుందా అన్న చర్చలు మరో సారి తెరపైకి వస్తున్నాయి.రాబోయే మే  నెల తరువాతే అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి మాట్లాడతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

త్వరలో తన నియోజకవర్గంలో మద్యపాన నిషేధ ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేసే పనిలో ఉన్నానన్నారు. లిక్కర్, బీర్ నిషేధించాలని సంగారెడ్డి ప్రజలు కోరుకుంటున్నారని, నియోజకవర్గంలో ఉన్న బీర్ల కంపెనీల నుండే తన ఉద్యమం ప్రారంభిస్తానన్నారు.