సకాలంలో జీతాలు అందక.. అనారోగ్య సమస్యలు తాళలేక ఓ మిషన్‌ భగీరథ కాంట్రాక్టు కార్మికురాలి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ బాధకర ఘటన  నల్లగొండలో ఘటన చోటుచేసుకుంది. 

సకాలంలో జీతాలు అందక అప్పులపాలై.. అనారోగ్యం బారిన పడి వైద్య చేయించుకోలేక.. కన్న బిడ్డలను పోషించుకోలేక.. ఓ మిషన్‌ భగీరథ కాంట్రాక్టు కార్మికురాలి బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండలో మిషన్‌ భగీరథ కాంట్రాక్టు కార్మికురాలిగా పని చేస్తున్న సింగం పుష్పలత(26) ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త మూడేళ్ల క్రితం చనిపోగా.. ఆ దంపతుల ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు. 

ఈ బాధకర ఘటన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండలోని పానగల్‌లో మిషన్‌ భగీరథ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక సింగం మహేశ్‌ అనే యువరైతుకు చెందిన మూడు ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఈ క్రమంలో మహేష్ కు మిషన్‌ భగీరథలో కాంట్రాక్టు కార్మికునిగా ఉపాధి కల్పించారు. ఈ క్రమంలో అనుముల మండలం అల్వాలకు చెందిన పుష్పలతకు మహేశ్‌ 2016లో పెళ్లి జరిగింది. వారికి కూతురు సాన్విత(6), కొడుకు సాయినందన్‌ (5) ఉన్నారు.

మిషన్‌ భగీరథలో కాంట్రాక్టు కార్మికుడైన మహేశ్‌కు నెలకు రూ.9వేల జీతం.. కానీ.. ఆ జీతం సకాలంలో అందకపోవడంతో అతను అప్పులపాలయ్యాడు. ఆ అప్పులను తీర్చలేక చివరికి 2020 మార్చి 3న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మహేశ్‌ పని చేసిన ప్లాంట్‌లోనే పుష్పలతకు కాంట్రాక్టు ఉద్యోగం కల్పించారు. తాను ఏడాదిన్నరగా ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఏ రోజుకు కూడా సకాలం అందలేదు. ఇదే తరుణంలో పుష్పలతకు ఆరోగ్యం పాలైంది. కడుపులో గడ్డ ఏర్పడి తీవ్ర అనారోగ్యానికి గురైంది. సకాలంలో జీతం అందకపోవడంతో కుటుంబపోషణ నిమిత్తం ఆమె రూ.2లక్షల వరకు అప్పు చేసింది. అప్పు ఇచ్చివారు డబ్బులువ్వాలని ఇటీవల ఒత్తిడి చేశారు.

ఇటు ఆర్థిక సమస్యలు, అటు ఆరోగ్య సమస్యలు.. వీటిని భరించలేకపోయిన పుష్పలత కఠిన నిర్ణయం తీసుకుంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడింది. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగొచ్చిన పిల్లలు ఎన్ని సార్లు తలుపు కొట్టినా తలుపు తీయలేదు. దీంతో ఇంటి ఇరుగుపొరుగు వారి వచ్చి.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే పుష్పలత మృతి చెందింది. ఇంటిని పరిశీలించిన పోలీసులకు పుష్పలత రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది.

సూసైడ్ నోట్ లో ఏముంది.?

ఆత్మహత్యకు ముందు పుష్పలత సూసైట్ నోట్ రాసింది. తన కష్టాన్ని అందులో వెలిబుచ్చింది. ‘ తాను పానగల్‌ మిషన్‌ భగీరథలో పనిచేస్తుననీ, సకాలం జీతం రావడం లేదని తెలిపింది. ఈ మధ్య కాలంలో తాను ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాననీ, కానీ.. వైద్యం చేయించుకోవడానికి డబ్బులేక.. చేసిన అప్పులను చెల్లించలేక చాలా బాధపడుతున్నానని తెలిపింది. తాను పని చేస్తున్న ఆ సంస్థలో పనిచేసే వారికి ఎలాంటి గుర్తింపు లేదనీ, తన భర్త చనిపోయినా.. తనకు గానీ, తన పిల్లలకు గానీ ఎలాంటి సహాయం అందలేదనీ ఆవేదన వ్యక్తం చేసింది. తన పిల్లలకు ప్రభుత్వమే న్యాయం చేయాలనీ, తనలాగా మరొక కుటుంబానికి ఇలా జరగకూడదని విన్నవించుకుంది. వచ్చే జీతం సరిపోక, పిల్లలను పోషించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, నాపిల్లలను జాగ్రత్తగా చూసుకోమని బతిమిలాడుకుంది. తన కడుపు నొప్పి తట్టుకోలేక.. తన పిల్లలను పోషించుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్టు పుష్పలత లేఖలో పేర్కొంది. 

బాధితురాలి కుటుంబాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. వారి రూ.లక్ష సాయం అందజేశారు. పుష్పలత కుటుంబాన్ని ఆదుకోవాలని కాంట్రాక్టు ఏజెన్సీకి ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. పుష్పలత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మిషన్‌ భగీరథ కార్మికులు నల్లగొండ ఎస్పీ బంగ్లా ఎదుట ఆందోళన చేపట్టారు. పుష్పలత మృతదేహంతో ఆర్‌డబ్ల్ల్యుఎస్‌ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఐదు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో పుష్పలత పిల్లలకు రూ.8లక్షలు అందజేస్తామని కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వాహకులు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. సకాలంలో జీతం ఇవ్వకపోవడంతోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మిషన్‌ భగీరథ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)