చిన్నారులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు ఒంటరిగా ఉన్న చిన్నారులమీద లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు కలవర పెడుతున్నాయి. మాయమాటలతో మభ్యపెట్టి వారిని లొంగదీసుకోవడమే కాకుండా.. ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు దిగజారుతున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కూకట్ పల్లి పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఓ బాలిక మీద దూరపు బంధువు ఒకరు అత్యాచారానికి ఒడిగట్టాడు. 

సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల మేరకు.. మూసాపేట జనతానగర్ లో నివాసముంటున్న జై బాలు (25), ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీలో ఉంటున్న తమకు దూరపు బంధువైన ఓ బాలికను గత నెల 17న తన పుట్టిన రోజు అని ఇంటికి రమ్మని పిలిచాడు. 

అతన్ని నమ్మి అమాయకంగా వచ్చిన బాలిక మీద అత్యాచారం చేశాడు. అక్కడితో ఊరుకోకుండా ఆ బాలికను అర్థనగ్నంగా చేసి సెల్ఫీ తీసి తన స్నేహితులకు పోస్ట్ చేశాడు.

ఆ ఫొటో అలా అలా బాలిక బంధువులకు చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్నబాలిక తల్లిదండ్రులు ఈ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

ఇంటికి రమ్మని పిలిచి.. తనను బలవంతంగా అత్యాచారం చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు జై బాలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.