తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాాలిక,ఇంటర్మీడియట్ చదివే యువకుడు కాకతీయ కెనాల్ లో గల్లంతయిన దుర్ఘటన హుజురాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.

కరీంనగర్: ఓ మైనర్ బాలిక ఇంటర్మీడియట్ యువకుడితో కలిసి నీటి కాలువలో మునిగి గల్లంతయిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా (karimnagar district)లో చోటుచేసుకుంది. అయితే ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు యువతీ యువకుడు కాలువలో పడి గల్లంతయ్యారా అన్నది తెలియాల్సి వుంది. ఇద్దరి కోసం కాలువలో గాలింపు కొనసాగుతోంది. 

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (huzurabad) పట్టణంలో తాడూరి పవన్(19) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. పట్టణంలోనే ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇతడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 

ఇక ఇదే హుజురాబాద్ లోని సైదాపూర్ రోడ్డులో నివాసముండే ఓ కుటుంబానికి చెందిన మైనర్ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. సదరు బాలిక పవన్ ఇంటికి సమీపంలో వుండే హైస్కూల్ లోనే చదువుకుంటోంది. 

అయితే కారణమేంటో తెలీదుగానీ ఈ మైనర్ బాలిక, పవన్ ఇద్దరూ బుధవారం రాత్రి సైదాపూర్ రోడ్డులోని కాకతీయ కెనాల్‌లో పడి గల్లంతయ్యారు. వీరిద్దరూ ప్రమాదవశాత్తు కెనాల్ పడి గల్లంతయ్యారా? లేదంటే కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది తెలియాల్సి వుంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాకతీయ కెనాల్ వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. ఇరువురి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలువలో నీటిప్రవాహం ఎక్కువగా వుండటంతో యువతీ యువకులు ఇప్పటికే మృతిచెందివుంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఏమయినా ఈ ఘటనకు కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలావుంటే దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో జరుగుతున్న మేడారంలో అపశృతి చోటు చేసుకుంది. వనదేవతల దర్శనానికి వెళ్లిన సింగ‌రేణి రిటైర్డ్ ఉద్యోగి స్నానం చేసేందుకు జంప‌న్న వాగులోకి దిగి మృతి చెందాడు. 

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం తిల‌క్ న‌గ‌ర్ కు చెందిన శాద న‌ర్స‌య్య (63) సింగ‌రేణి లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మేడారం జాతర జ‌రుగుతున్న నేపథ్యంలో ఆ జాత‌ర‌కు వెళ్లాల‌ని అనుకున్నారు. అయితే బుధ‌వారం కుటుంబ స‌భ్యులు అంతా క‌లిసి జాత‌ర‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో శాద న‌ర్స‌య్య జంప‌న్న వాగులో స్నానం చేద్దామ‌నుకున్నాడు. స్నానం కోసం అని వాగులోకి వెళ్లిన ఆయ‌న ఉన్న‌ట్టుండి బ్యాలెన్స్ త‌ప్పి బ్రిడ్డి కింద ఉన్న గుంత‌ల్లో ప‌డిపోయాడు. 

ఇది గ‌మ‌నించిన‌ కుమారుడు అశోక్ తండ్రిని వెంట‌నే బ‌య‌ట‌కు తీశాడు. స‌మీపంలోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లాడు. కానీ హాస్పిట‌ల్ కు వెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆయ‌న అప్ప‌టికే మృతి చెందాడ‌నే చేదు వార్త‌ను డాక్ట‌ర్లు కుమారుడికి చెప్పారు.