తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసులకు భయపడేది లేదని చెప్పారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసులకు భయపడేది లేదని చెప్పారు. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న సమయంలోనే.. కవిత రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతిని దేశవ్యాప్తంగా తెలిసేలా చేశారని అన్నారు. భారతదేశంలో ఎవరి మీద ఎందుకు కేసులు పెడుతున్నారనే ప్రతి ఒక్కరి అర్థమవుతుందని చెప్పారు. 

బీజేపీ దొంగస్వాములు హైదరాబాద్‌లో పట్టుబడితే వారిపై కేసులు ఉండయని అన్నారు. తమపై మాత్రం అన్యాయంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ఆయన తవ్విన గోతిలో ఆయనే పడతారని విమర్శించారు. 2023 ఎన్నికల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నోరు ఉందని ఏట్లపడితే అట్లా మాట్లాడితే సమాజం ఉరుకోదని అన్నారు. 

బండి సంజయ్ లాంటి వాళ్లను రాజకీయ బహిష్కరణ చేయాలని అన్నారు. బండి సంజయ్‌ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యాలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని డిమాండ్ చేశారు. తాము కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. మళ్లీ 2023లో అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌నేనని ధీమా వ్యక్తం చేశారు. 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. బీజేపీ నాయకులు ధర్నా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. మహిళకు మేయర్ స్థానం కట్టబెట్టిన ప్రభుత్వం తమదని చెప్పారు. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. మహిళలే మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. రూ. 400 ఉన్న గ్యాస్ ధరను.. రూ. 1,200కు పెంచారని.. మహిళలకు మంచి చేస్తున్నామా? అనేది బీజేపీ నాయకులు వాళ్లకు వాళ్లు ఆలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బండి సంజయ్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.