Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం.. అందుకోసమేనా..?

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. 

ministers and mlas in greater hyderabad emergency Meet in Telangana Bhavan
Author
First Published Nov 22, 2022, 11:44 AM IST

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. కొందరు మంత్రులతో పాటు, గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో.. ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశం అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై టీఆర్ఎస్ అధికారికంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటుగా కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

గత కొంతకాలంగా కేంద్రంలోని అధికార బీజేపీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌ల మధ్య  తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ప్రతిపక్షాల పార్టీల నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని విమర్శిస్తుంది. దేశంలోని పలు విపక్షాలు సైతం ఇదేరకమైన ఆరోపణలు చేస్తున్నాయి. 

అయితే గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్‌ పార్టీకి సంబంధించిన నేతలపై రాజకీయ కక్షతో మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలచేత దాడులు చేయిస్తోందిన టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు, క్యాసినో వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి  కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మంత్రి తలసాని సన్నిహితులను ఈడీ విచారణకు పిలవడం, కొందరు టీఆర్ఎష్ ఎంపీల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడుల వంటి ఘటనలను వారు ప్రస్తావిస్తున్నారు. తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. 

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరుల ఇళ్లలో ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై దాదాపు ఐటీ 50 బృందాలు మంగళవారం తెల్లవారుజామున నుంచి సోదాలు జరుపుతున్నాయి. కొంపల్లిలోని పామ్ మెడోస్ విల్లాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios