కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మెపై విద్యామంత్రి కడియం ఆగ్రహం జీవో 16 ప్రకారం క్రమబద్దీకరణకు అనర్హులవుతారని హెచ్చరిక 12వ తేదీలోపు విధుల్లో చేరాలని సూచన
సమ్మె చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు వెంటనే విధుల్లో చేరాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. లేదంటే జీవో నెంబర్ 16 ప్రకారం వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాంట్రాక్టు లెక్చరర్లందరినీ క్రమబద్దీకరిస్తామని కేబినెట్ లో తీర్మానం చేశామని, వేతనాలను 50 శాతం పెంచేందుకు జీవో తీసుకొచ్చినా..కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు సమ్మె చేయడం సహేతుకం కాదని అన్నారు.
క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించామని, అర్హతలు, నిబంధనలు నిర్ణయించి ఉత్తర్వులు కూడా ఇచ్చామన్నారు. ఈ క్రమంలో ఓయు జేఏసీకి చెందిన కొంతమంది కోర్టుకు వెళ్లడంలో తుది తీర్పు ఇచ్చే వరకు క్రమబద్దీకరణ చేయవద్దని ఆదేశాలు ఇచ్చిందన్నారు.
అందుకే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందన్నారు. ఇది ఆలస్యమవుతుందనే కారణంతో వేతనాలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు ఉన్న సందర్భంలో విద్యార్థులకు తోడ్పాటు అందించాల్సిన లెక్చరర్లు సమ్మె చేయడం సరైంది కాదన్నారు.
ఈ నెల 12 లోపు అందరూ సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించారు. పంతాలకు పోయి సమ్మె చేస్తే ఉద్యోగం ఊడే ప్రమాదం ఉందన్నారు.
