అగ్నిప్రమాదాలపై తలసాని సీరియస్.. గోడౌన్లలో సేఫ్టీ మెజర్మెంట్స్ పై వ్యాపారులకు నోటీసులు...
హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న గోడౌన్ల అగ్నిప్రమాదాల మీద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. అనుమతులు లేకుండా నడిపే గోడౌన్ల మీద కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో తరచుగా గోడంలలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గోదాంల మీద కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి, అక్రమంగా నడుస్తున్న హైదరాబాదులోని వేలాది గోడౌన్లను ప్రభుత్వం గుర్తించింది. ఈ గోడౌన్ లో యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నోటీసులు వెళ్లిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే వారి మీద క్రిమినల్ కేసులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీనిమీద డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెంట్రల్ జోన్ లోని గోదాం యజమానులకు నోటీసులు ఇవ్వనున్నామని తెలిపారు. ఏ వ్యాపారి అయినా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం గోడౌన్లను ఏర్పాటు చేసే విషయంలో పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. జనవరిలో సికింద్రాబాద్లోని డక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ ఘటనను మరువకముందే హైదరాబాదులో గురువారం నాడు మరో రెండు అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం..
ఒకేరోజు జరిగిన ఈ రెండు ఘటనలు కూడా గోడౌన్ లలోనే జరగడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. చిక్కడపల్లిలోని టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే షాపు గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరగగా.. మరో ప్రమాదం వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో జరిగింది. టైర్ల రీబటన్ కంపెనీతో పాటు, గోడౌన్ లోను మంటలు చెలరేగాయి. మంటల కారణంగా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
చిక్కడపల్లిలో జరిగిన ప్రమాద ఘటనలో గంటన్నర తర్వాత ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు . టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే షాపు గోదాం కావడంతో అక్కడ ధర్మకోల్, ఫైబర్, ప్లాస్టిక్, స్పాంజ్, చెక్క సామాన్లు ఉండడంవల్ల మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దాదాపు 6 ఫైరింజన్లతో మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించింది. ఈ రెండు ప్రమాదాల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే భారీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఈ రెండు అగ్ని ప్రమాద ఘటనలకు షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు గోదాములలోను ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఎక్కడ కనిపించలేదు. మంటలు అదుపులోకి వచ్చాయి కానీ నల్లటి పొగ ఇంకా వస్తూనే ఉందని అధికారులు తెలిపారు.
ఈ అగ్ని ప్రమాద ఘటనల మీద తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. జరిగిన ప్రమాదం మీద అధికారులను ఆరా తీశారు. అగ్ని ప్రమాద ఘటనల మీద తలసాని శ్రీనివాస యాదవ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా వ్యాపారస్తుల్లో మార్పు రావట్లేదు అన్నారు. ఇకమీదట ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. వేసవికాలం రాబోతున్న సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నామని ఒక కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.