తెలంగాణలోని మత్స్యకారులను ధనవంతులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 

హైదరాబాద్ : ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ రాష్ట్రం నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇదే లక్ష్యంతో మత్స్యకారుల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. ప్రభుత్వమే చెరువుల్లో చేపలు వదిలి మత్స్యసంపదను సృష్టిస్తోందని... వాటి ద్వారా మత్స్యకారులు లాభపడుతున్నారని మంత్రి తలసాని అన్నారు. 

ఇవాళ జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బేగంపేట హరిత ప్లాజాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

మంత్రి తలసాని మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు తర్వాత మత్స్యకారులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. చెరువులపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిందని అన్నారు. 

వీడియో

భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను ప్రభుత్వమే పంపిణీ చేస్తోందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడ్డాయని... వాటిలో చేపలను వదలడం ద్వారం మత్స్యకారులకు మేలు జరుగుతోందని అన్నారు. దీంతో రాష్ట్రంలో మత్స్యసంపద గణనీయంగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.