ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం (ఫిబ్రవరి 5) హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలకడానికి కేసీఆర్ (KCR) వెళ్లడం లేదు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం (ఫిబ్రవరి 5) హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas Yadav) యాదవ్ స్వాగతం పలకనున్నారు. అలాగే ప్రధాని మోదీ పర్యటన ముగిసి తర్వాత వీడ్కోలు పలకనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటుగా, వెళ్లేటప్పుడు వీడ్కోలు పలకడానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌‌కు అవకాశం కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించినట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్లడం లేదు. ఆయనకు బదులు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను పంపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు.. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని, వివక్ష చూపెడుతుందని ఆరోపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ విషయంలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఇదిలా ఉంటే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహంతో ఉన్నట్టుగా టీఆర్‌ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఈ పరిణమాల నేపథ్యంలో కేసీఆర్.. మోదీకి స్వాగతం పలకడానికి తాను వెళ్లకుండ మంత్రి తలసానిని పంపుతున్నారు.

మోదీ పర్యటన షెడ్యూల్..
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను మోదీ ప్రారంభించనున్నారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇక్రిశాట్ లోగోను మోదీ ఆవిష్కరిస్తారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. 

అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్ట‌ర్‌లో ప్రధాని మోదీ ముచ్చింతల్ బయలుదేరనున్నారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆయన ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. తొలుతు ముచ్చింతల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడ 10 నిమిషాల పాటు రీప్రెష్ అవుతారు. అనంతరం నేరుగా యాగశాలకు వస్తారు. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొంటారు.

216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్​ స్వామితో కలిసి పూజచేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం అక్కడి నుంచే మోదీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శిస్తారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా షెడ్యూల్‌లో మార్పులు జరగవచ్చని అధికారులు చెబుతున్నారు.