సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.

సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసం ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. అక్కడే కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తారకరత్నకు కడసారి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నందమూరి తారకరత్న చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని అన్నారు. 20 ఏళ్ల వయసులోనే తారకరత్న సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారని.. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారని అన్నారు. తారకరత్న ఆయన తాత ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ.. అందరితో కలివిడిగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నట్టుగా చెప్పారు. 

ఇక, ఫిల్మ్‌చాంబర్‌ వద్ద తారకరత్న భౌతికకాయాన్ని చూసి ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకు అలా చూసి తట్టుకోలేకపోయారు. మరోవైపు తారకరత్న సతీమణి అలేఖ్య పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లతో పాటు పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, వెంకటేశ్, సురేష్ బాబు, ఆదిశేషగిరి రావు, బుర్రాసాయి మాధవ్, అనిల్ రావిపూడి, చింతమనేని ప్రభాకర్ రావు.. తదితరులు ఫిల్మ్‌ఛాంబర్‌కు చేరుకుని తారకరత్నకు కడసారి నివాళులర్పించారు.

మరోవైపు తారకరత్నకు కడసారి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున ఫిల్మ్‌చాంబర్‌కు తరలివస్తున్నారు. ఇక, మధ్యాహ్నం తర్వాత ఫిల్మ్‌ఛాంబర్‌ నుంచి తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారకరత్న అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.