కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. వ్యవస్థలు వారి చేతుల్లో ఉన్నాయని దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. వ్యవస్థలు వారి చేతుల్లో ఉన్నాయని దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పులవురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. 

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు అంతా చూస్తున్నారని తెలిపారు. ప్రజల మన్నలను పొందడానికి ప్రయత్నాలు చేయాలి గానీ.. కక్ష సాధింపు చర్యలేమిటని ప్రశ్నించారు. జరుగుతన్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కేంద్ర సంస్థల దాడులను ఎదుర్కొంటామని తెలిపారు. వీటన్నింటికి భయపడితే హైదరాబాద్‌లో ఉంటామా? అని అన్నారు. టీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఈ దాడులు అని మండిపడ్డారు.

తాటాకు చప్పుళ్లకు భయపడమని మంత్రి తలసాని. వ్యవస్థలపై ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ నగర టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 

ఇక, గత కొంతకాలంగా కేంద్రంలోని అధికార బీజేపీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌ల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ప్రతిపక్షాల పార్టీల నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని విమర్శిస్తుంది. దేశంలోని పలు విపక్షాలు సైతం ఇదేరకమైన ఆరోపణలు చేస్తున్నాయి. 

అయితే గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్‌ పార్టీకి సంబంధించిన నేతలపై రాజకీయ కక్షతో మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలచేత దాడులు చేయిస్తోందిన టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు, క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని సన్నిహితులను ఈడీ విచారణకు పిలవడం వంటి ఘటనలను వారు ప్రస్తావిస్తున్నారు. తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఆర్ఎస్ నేతల అత్యవసరంగా సమావేశం అయ్యారు.