Asianet News TeluguAsianet News Telugu

జింఖానా గ్రౌండ్ తొక్కిసలాట బాధితులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

భారత్-ఆస్ట్రేలియాల టీ20 మ్యాచ్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు భారీగా చేరుకోవడంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. వారిని ఆదివారం తెలంగాణ క్రీడా శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. 

Minister Srinivas Goud to Watch Ind Vs aus T20 match along with gymkhana ground stampede victims
Author
First Published Sep 25, 2022, 4:43 PM IST

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియాల టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల ఈ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు భారీగా చేరుకోవడంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. వారిని ఆదివారం తెలంగాణ క్రీడా శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తొక్కిసలాటలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నవీనను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రోత్సహం ఉంటుందని వెల్లడించారు. ఇక, తొక్కిసలాటలో గాయపడినవారితో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నట్టుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. వారితో కలిసి శ్రీనివాస్ గౌడ్‌ మ్యాచ్‌ను వీక్షించనున్నట్టుగా పేర్కొన్నారు.

భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో.. ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో నేటి మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరనేది తేలనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టికెట్లు పొందిన క్రీడాభిమానులు స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. దాదాపు మూడు ఏళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో.. ఉప్పల్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. 

 


Also Read: IND vs AUS T20I: ఉప్పల్‌ టీమిండియాకు అనుకూలమేనా..? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..!

ఇక, ఈ మ్యాచ్ కోసం శనివారం సాయంత్రమే ఇరు జట్లు నగరానికి చేరుకున్నాయి. మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియంతో పాటు, క్రికెటర్లు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేశారు. అక్కడి నుంచి నిరంతం పర్యవేక్షణ జరగనుంది. 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాగోల్, చెంగిచెర్ల ఎక్స్ రోడ్, ఎన్‌ఎఫ్‌సి బ్రిడ్జి, హబ్సిగూడ, అంబర్‌పేట్ వైపు నుంచి ఉప్పల్ వైపు భారీ వాహనాలకు అనుమతి ఉండదు. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios