బీసీ ప్రధాని.. బీసీలకు ఏం చేశాడు?: బీజేపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
బీసీ ప్రధాని బీసీలకు ఏం చేశాడు? 80 వేల కోట్ల బీసీ జనాభాకు కనీసం రూ. 2 వేల కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు.
హైదరాబాద్: అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్న బీజేపీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెబుతున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిని బీసీ నేతనే ప్రకటించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. బీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలను బీజేపీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నేత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ పార్టీపై విమర్శలు సంధించారు.
మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీసీలను ఆకట్టుకునే క్రమంలో దేశ ప్రధానమంత్రిగా బీజేపీ ఒక బీసీ నేతను ఎంచుకున్నదనే మాట వాడుతూ ఉంటుంది. ఈ వాదనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడని, కానీ, ఆయన బీసీలకు ఏం చేశాడని నిలదీశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని అన్నారు. బీసీ జన గణనకూ చోటు లేదని పేర్కొన్నారు. 80 వేల కోట్ల జనాభా ఉన్న బీసీలకు కనీంస రూ. 2 వేల కోట్ల బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
కాగా, ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల్లో బీసీలకు అగ్రతాంబూలం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని, బీసీల గురించి బీజేపీ మాట్లాడటమే హాస్యాస్పదం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఓడిపోయే స్థానాల్లో బీసీలను నిలబెట్టి ఓడించే కుట్ర బీజేపీ చేస్తున్నదని మండిపడ్డారు. అదే బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఉంటే 33 శాతం బీసీలకు రిజర్వేషన్ వచ్చేది కదా? అంటూ నిలదీశారు.
Also Read : 19 రిజర్వ్‌డ్ సీట్లలో కనీసం 14 సీట్లు మాదిగలకు ఇవ్వాలి: మందకృష్ణ మాదిగ డిమాండ్
ఎమ్మెల్యేలుగా బీసీలు గెలిస్తే అభివృద్ధి చెందుతారా? అంటూ మంత్రి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ గురుకులాలు పెట్టారా? అంటూ అడిగారు. ఐదు సీట్లు గెలుస్తారో లేదో.. అలాంటి బీజేపీ బీసీలకు సీట్లు ఇస్తే గెలిచేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఓడిపోయే స్థానాల్లో బీసీలను నిలబెట్టి ఓడించి.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నే ఓడించిందనే అపవాదు పెట్టాలని కుట్ర చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.