మహబూబ్ నగర్: తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖామంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం చోటుచేసుకుంది.  వయసుమీద పడటంతో మంత్రి తండ్రి నారాయణగౌడ్(73) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా అతడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చేర్చారు. ఈ క్రమంలోనే ఆదివారం అతడి పరిస్థితి మరింత దిగజారి ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదఛాయలు అలుముకున్నారు. 

కన్నతండ్రి మృతిచెందడంతో బాధలో మునిగిపోయిన మంత్రిని సహచర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓదార్చారు. నారాయణగౌడ్‌ మరణ వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రలు నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దామోదర్‌రెడ్డి, బాల్క సుమన్‌లు యశోదా ఆస్పత్రికి వెళ్లారు. పార్థీవదేహానికి నివాళి అర్పించి మంత్రిని ఓదార్చారు. ఇక అసెంబ్లీ స్పీకర్ పోచారం, మంత్రి జగదీష్ రెడ్డిలు కూడా మంత్రికి ఫోన్ చేసి ఓదార్చారు.

మంత్రి తండ్రి నారాయణగౌడ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. అందరితో కలుపుగోలుగా వుండే అతడు మరణించినట్లు తెలియడంతో స్వగ్రామంలో కూడా విషాదం నెలకొంది. ఇవాళ స్వగ్రామంలోనే నారాయణ గౌడ్ అంత్యక్రియలు జరగనున్నారు. ఇందులో మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నారు.