దేశంలో ఎస్సీ, ఎస్టీలు వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం  చేస్తూ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.

దేశంలో ఎస్సీ, ఎస్టీలు వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు తప్పుడు డిక్లరేషన్‌ ప్రకటించారని.. వారి డిక్లరేషన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ పూర్తిగా మోసపూరితమని విమర్శించారు. దేశం మొత్తం ఇదే డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించే దమ్ముంద అని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్ కుట్రలను ఎస్సీలు, ఎస్టీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. 3,146 గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఎస్టీ రిజర్వేషన్‌ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని అన్నారు. హైదరాబాద్‌లో కుమ్రంభీం, సేవాలాల్‌ భవనాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీల ప్రజల ఓట్లతో పదవులు అనుభవించిన కాంగ్రెస్ ఇన్నేళ్లలో వారి కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బూటకపు హామీలిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ కపట మాటలను దళిత, గిరిజన బిడ్డలు నమ్మొద్దని కోరారు.